- బోలివియాలో కుప్పకూలిన సైనిక విమానం
- మరో 30 మందికి గాయాలు
- రోడ్డుపై పడిన నోట్ల కోసం ఎగబడిన స్థానికులు
బోలివియాలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం ఎల్ ఆల్టో నగరంలో రద్దీగా ఉండే రహదారిపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బోలివియా వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం సెంట్రల్ బ్యాంక్ నోట్లతో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి సమీపంలోని రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపై పడిపోయింది. ఈ ఘటనలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడటంతో పాటు, అది తీసుకెళ్తున్న కరెన్సీ నోట్ల కట్టలు రోడ్డంతా వెదజల్లబడ్డాయి.
ప్రమాద స్థలంలో కిందపడిన నోట్లను ఏరుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మృతుల్లో విమాన సిబ్బందితో పాటు, కింద రోడ్డుపై ఉన్న పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అధికారులు ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: