జాతీయ రాజకీయ వార్తలు

కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!

కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో సగానికి పైగా కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కేరళ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. ఈ నివేదిక ప్రజాప్రతినిధుల నేర, ఆర్థిక చరిత్రను కళ్లకు కట్టింది.

ఏడీఆర్ సంస్థ రాష్ట్రంలోని 132 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించి ఈ వివరాలను బయటపెట్టింది. నివేదిక ప్రకారం 92 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 33 మంది (25 శాతం) హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలపై హత్య కేసులు (ఐపీసీ సెక్షన్ 302), ముగ్గురిపై హత్యాయత్నం కేసులు (ఐపీసీ సెక్షన్ 307) నమోదయ్యాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉండగా, అందులో ఒకరిపై అత్యాచారం కేసు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

పార్టీల వారీగా చూస్తే.. దాదాపు అన్ని పార్టీలలోనూ నేరచరితులైన ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార సీపీఎంలో 58 మంది ఎమ్మెల్యేలలో 43 మంది (74 శాతం)పై కేసులున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలలో 19 మంది (90 శాతం) క్రిమినల్ కేసులను ప్రకటించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లో 86 శాతం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)లో 44 శాతం మంది ఎమ్మెల్యేలు కేసులను ఎదుర్కొంటున్నారు.

ఆర్థిక విషయాలకు వస్తే.. 132 మంది ఎమ్మెల్యేలలో 72 మంది (55 శాతం) కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. మొత్తం 132 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.363.78 కోట్లు కాగా, ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.2.75 కోట్లుగా తేలింది. కాంగ్రెస్‌కు చెందిన మాథ్యూ కుఝల్‌నాదన్ రూ.34 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలవగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మణి సి. కప్పెన్ (రూ.27 కోట్లు), కేరళ కాంగ్రెస్ (బి)కి చెందిన కేబీ గణేశ్‌ కుమార్ (రూ.19 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు సీపీఎం ఎమ్మెల్యే పీపీ సుమోద్ కేవలం రూ.9.9 లక్షల ఆస్తులతో అత్యంత తక్కువ ఆస్తిపరుడైన ఎమ్మెల్యేగా రికార్డయ్యారు.

విద్యా నేపథ్యం పరంగా 61 శాతం మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్లు లేదా ఆపై చదువుకున్న వారు కాగా, శాసనసభలో మహిళా ప్రాతినిధ్యం కేవలం 8 శాతానికే (11 మంది) పరిమితమైంది. వయసు పరంగా చూస్తే, 70 శాతం మంది ఎమ్మెల్యేలు 51 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులే.

Related posts

మోదీకి దగ్గరవుతున్న శశిథరూర్.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం..

Ram Narayana

కర్ణాటక కాంగ్రెస్‌లో కుర్చీ ఫైట్.. సిద్ధూ, డీకే మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

రాహుల్ గాంధీ మరో యాత్ర.. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్ టు ముంబై

Ram Narayana