తెలంగాణ వార్తలు

ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన ‘రైతు భరోసా’ పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగిన ‘శ్రీ పరాభవ నామ ఉగాది’ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును ‘రాజు’గా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇప్పటికే రైతు భరోసా కింద రూ.18,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రుణభారంతో ఉన్న రైతులకు పెద్ద ఊరటనిస్తూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. దేశంలోనే అత్యంత తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని చెప్పడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌తో రైతులకు ఎదురైన భూ యాజమాన్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దాని స్థానంలో ‘భూ భారతి’ని తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పునరుద్ఘాటించారు. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

బోరబండలో యువతి దారుణ హత్య…

Ram Narayana

బ్యాంకాక్ వెళుతుండగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ అరెస్ట్.. హరీశ్ రావు ఖండన!

Ram Narayana

పువ్వాడ ఆక్రమణలను తొలగింపుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ..సీఎం రేవంత్ రెడ్డి ..

Ram Narayana