- ఆటో డెబిట్ చెల్లింపులకు ఓటీపీ నిబంధనల సడలింపు
- రూ.15,000 వరకు చెల్లింపులకు ఓటీపీ నుంచి మినహాయింపు
- బీమా, సిప్, క్రెడిట్ కార్డులకు లక్ష రూపాయల వరకు వెసులుబాటు
- చెల్లింపులకు ముందు, తర్వాత కొనసాగనున్న ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు
కరెంట్ బిల్లు, గ్యాస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ల వంటి రికరింగ్ చెల్లింపులు చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుభవార్త చెప్పింది. ప్రతిసారీ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా, రూ.15,000 వరకు ఆటోమేటిక్ చెల్లింపులకు అనుమతిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో తరచూ చేసే పేమెంట్లు మరింత సులభతరం కానున్నాయి.
వినియోగదారుల సౌలభ్యం కోసం ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బిల్లులకు రూ.15,000 పరిమితి వర్తించనుండగా, బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ సిప్ (SIP), క్రెడిట్ కార్డు చెల్లింపుల వంటి వాటికి ఈ పరిమితిని రూ.లక్ష వరకు పెంచారు. ఈ మొత్తానికి మించి లావాదేవీ జరిపితే మాత్రం ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఏదేని సేవ కోసం తొలిసారి ఆటో డెబిట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు, మొత్తం ఎంతైనా సరే ఓటీపీని నమోదు చేయడం తప్పనిసరి.
ఓటీపీ అవసరం లేకుండా డబ్బులు డెబిట్ అయినప్పటికీ, భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెల్లింపు జరగడానికి కనీసం 24 గంటల ముందు, ఆ తర్వాత కూడా సంబంధిత బ్యాంకులు వినియోగదారులకు ఎస్సెమ్మెస్ ద్వారా అలర్ట్ సందేశాలు పంపిస్తాయి. ఈ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది.
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో వినియోగదారులకు సౌలభ్యం పెరగనుంది. ఫోన్‌కు సిగ్నల్ లేకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో చెల్లింపులు విఫలమయ్యే సమస్యలు ఇక ఉండవు. తద్వారా సేవల అంతరాయంతో పాటు క్రెడిట్ కార్డు, విద్యుత్ బిల్లుల ఆలస్యానికి విధించే జరిమానాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: