- తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే
- ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ
- సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఓడించిన టీవీకే అభ్యర్థులు
- రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన నటుడు విజయ్
- తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ!
తమిళగ వెట్రి కళగం (టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ చెన్నైలోని పనయ్యూర్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి పార్టీ అధినేత విజయ్, జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిశాక విజయ్ తన నివాసానికి వెళ్లిపోయారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ, మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కుకు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులతో విజయ్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ ఎన్నికల్లో టీవీకే ధాటికి ఎంకే స్టాలిన్, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్, ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వంటి ఎందరో రాజకీయ ప్రముఖులు ఓటమి పాలయ్యారు. కొళత్తూరులో సీఎం స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి 8,795 ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్, రెండు చోట్లా ఘనవిజయం సాధించి తన ప్రజాకర్షణను నిరూపించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి టీవీకే గండికొట్టింది.

- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజయ్ లేఖ
- రెండు వారాల్లో బలం నిరూపించుకుంటామని వెల్లడి
- తమిళ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ రాజకీయ అనిశ్చితి నడుమ, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా ఈ లేఖను పంపినట్లు సమాచారం. అసెంబ్లీలో రెండు వారాల్లోగా తమ బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది.
డీఎంకే, ఏఐఏడీఎంకేలకు షాక్.. మారిన రాజకీయ సమీకరణాలు
తాజా ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి, ఏఐఏడీఎంకే 47 స్థానాలతో మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. డీఎంకేను అధికారానికి దూరం పెట్టేందుకు ఏఐఏడీఎంకే (47) విజయ్‌కు మద్దతు ఇస్తుందా? లేక కాంగ్రెస్ (5), ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో కలిసి విజయ్ సర్కార్ ఏర్పాటు చేస్తారా? అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విజయ్‌తో టచ్‌లో ఉన్నారని, రాహుల్ గాంధీ సైతం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.
దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకేల ద్విముఖ పోరుకు విజయ్ పార్టీ అనూహ్యంగా తెరదించింది.
తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటు మార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన విజయ్‌కు మద్దతిచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి పక్షాలు సుముఖంగా లేవని స్పష్టం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగ్గా, నిన్న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. తొలిసారే బరిలోకి దిగిన విజయ్ పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద శక్తిగా నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు 10 స్థానాల దూరంలో ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలకు తెరపడింది. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) ప్రధాన కార్యదర్శి వైగో మాట్లాడుతూ… “విజయ్ పార్టీకి మద్దతిచ్చే ఆలోచన డీఎంకే కూటమిలోని ఏ పార్టీకి లేదు” అని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) నేత థోల్. తిరుమావళవన్ వ్యక్తం చేశారు. “మేమంతా లౌకిక రాజకీయ మార్గంలో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నాం. భవిష్యత్తులో కూడా కీలక నిర్ణయాలు కలిసే తీసుకుంటాం. టీవీకేకు మద్దతివ్వడంపై ఇప్పటివరకు ఆలోచించలేదు” అని ఆయన వివరించారు.
మరోవైపు దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అధినేత్రి ప్రేమలత విజయకాంత్ కూడా మద్దతుపై స్పష్టత ఇవ్వలేదు. తన భర్త విజయకాంత్‌తో విజయ్‌కు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. “విజయ్ మా ఇంటి బిడ్డ లాంటివాడు. కెప్టెన్‌కు చాలా సన్నిహితుడు. ఆయన గెలుపునకు అభినందనలు” అని పేర్కొన్నప్పటికీ, మద్దతుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. డీఎంకే కూటమిలో 10 స్థానాల్లో పోటీ చేసిన డీఎండీకే కేవలం విరుధాచలం స్థానంలో మాత్రమే గెలిచింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఓటమిపాలు కావడంతో కూటమిలో సంబరాల వాతావరణం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభన నడుమ, విజయ్ చెన్నైలోని పనైయూర్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది రానున్న రోజుల్లో తేలనుంది.
తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ పార్టీలకు భారీ షాక్ తగలడం తెలిసిందే. స్టాలిన్ సమర్పించిన రాజీనామా లేఖను తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించి, రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కుకు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. మరోవైపు, అధికార డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికాయి.
ఈ ఎన్నికల్లో స్టాలిన్‌కు వ్యక్తిగతంగానూ ఊహించని పరాభవం ఎదురైంది. తన కంచుకోటగా భావించే కొళత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఆయన 8,795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓట్ల శాతం పరంగా చూస్తే, టీవీకే 32 శాతానికి పైగా ఓట్లు సాధించగా, డీఎంకే 24.19 శాతం, అన్నాడీఎంకే 21.22 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి.
ఎన్నికల ఫలితాలపై స్టాలిన్ స్పందిస్తూ, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తూనే, గెలిచిన పార్టీతో తమ కూటమికి ఓట్ల శాతంలో తేడా చాలా స్వల్పమని పేర్కొన్నారు. “డీఎంకే నేతృత్వంలోని కూటమికి ఓటు వేసిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కూటమికి 1.54 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి. గెలిచిన పార్టీతో ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమే. తమిళనాడు ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని నేను బలం అని భావిస్తున్నాను” అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, డీఎంకే మిత్రపక్షాల నేతలు బుధవారం స్టాలిన్‌తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మిత్రపక్షాల కోసం టీవీకే ప్రయత్నాలు ప్రారంభించనుంది.
ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండరు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

- విజయ్ ఎన్నికల విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందన
- కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ
- తన పార్టీని ఓడిస్తాడని కరుణానిధి అప్పుడు ఊహించి ఉండరంటూ వ్యాఖ్య
- తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం
- మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. “తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని ఓడిస్తాడని కలైంగర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండరు” అని ఆర్జీవీ పేర్కొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తండ్రే కరుణానిధి కావడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తిగా అవతరించింది.