చైనాలో 135 ఏళ్ల వయసులో కన్నుమూసిన అత్యంత పెద్ద వయస్కురాలు!
- ఆమె పేరు అలిమిహాన్ సీయిటీ
- 1886 జూన్ 25న జననం
- చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ ఆమె స్వస్థలం
- సాధారణ జీవనంతో 100 ఏళ్లకు పైగా జీవించిన వైనం
నిండు నూరేళ్లు బతకడం అనేది చాలా అరుదైన విషయం. అయితే ప్రపంచంలో అక్కడక్కడా శతాధిక వృద్ధులు కనిపిస్తుంటారు. ఈ చైనా మహిళ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఆమె పేరు అలిమిహాన్ సీయిటి. ఆమె వయసు 135 సంవత్సరాలు. విషాదకరమైన అంశం ఏమిటంటే అలిమిహాన్ సీయిటీ కన్నుమూసింది. ఆమె జిన్ జియాంగ్ ఉయిగర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని కొముక్జెరిక్ టౌన్ షిప్ లో నివసించేది. ఆమె మరణాన్ని స్థానిక అధికార వర్గాలు నిర్ధారించాయి. వృద్ధాప్యం కారణంగా మరణించినట్టు వెల్లడైంది.
అలిమిహాన్ సీయిటి 1886 జూన్ 25న జన్మించినట్టు జిన్ జియాంగ్ కౌంటీ ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. చైనాలో జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కురాలిగా 2013లో ఆమె రికార్డు పుటల్లోకెక్కారు. కాగా, చనిపోయేంతవరకు కూడా సీయిటి ఎంతో సాధారణ జీవితం గడిపినట్టు అధికారులు వెల్లడించారు. వేళకు తినడం, ఇంటి పెరట్లో సూర్యరశ్మిలో అత్యధిక సమయం గడపడమే ఆమె ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఆమె తన ముని మనవళ్లు, ముని మనవరాళ్లను కూడా పెంచిందట.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… అలిమిహాన్ సీయిటీ నివసించిన కొముక్జెరిక్ పట్టణంలో 90 ఏళ్లకు పైబడిన వృద్ధులు చాలామందే ఉన్నారట. అందుకే కొముక్జెరిక్ పట్టణాన్ని దీర్ఘాయుష్షు పట్టణం అని పిలుస్తారు. అక్కడి ఆరోగ్య శాఖ సేవలు కూడా ప్రజల ఆయుప్రమాణాలు మరింత పెరిగేందుకు దోహదపడుతున్నాయట.
అక్కడ ప్రజలకు ఏటా ఉచిత వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తుంటారు. అంతేకాదు, 60 ఏళ్లకు పైబడిన వారికి అనేక రాయితీలతో కూడిన సౌకర్యాలు అందిస్తూ వారి ఆరోగ్యమయ జీవనానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పడుతోంది.