అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత
- ఎమర్సన్ ప్రాంతంలో మృతదేహాల గుర్తింపు
- సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలో మృతదేహాలు
- సరిహద్దు దాటే యత్నంలో మంచుకు బలి
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అమెరికా-కెనడా సరిహద్దుల్లో మంచుతో నిండిన ప్రాంతంలో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. మృతుల్లో ఓ పసికందు కూడా ఉన్నట్టు గుర్తించారు. కెనడా భూభాగం నుంచి అమెరికా గడ్డపైకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు ధాటికి వారు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎమర్సన్ ప్రాంతం వద్ద కెనడా భూభాగంలో వారి మృతదేహాలను గుర్తించారు.
సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఓ పురుషుడు, స్త్రీ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలు పడి ఉన్నాయి. ఎమర్సన్ వద్ద ఓ సమూహం సరిహద్దు దాటే ప్రయత్నం చేసి ఉంటుందని, కానీ భారతీయ కుటుంబం వాతావరణం అనుకూలించకపోవడంతో బలైపోయిందని కెనడా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన భారతీయుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.