-మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు
-బుద్ధాను విజయవాడ వన్ టౌన్ స్టేషన్ కు తరలింపు
-బుద్ధా నివాసం వద్ద ఉద్రిక్తత
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బుద్ధా వెంకన్నను పోలీసులు విజయవాడ వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు. ఈ సాయంత్రం బుద్ధా నివాసానికి పోలీసులు రావడంతో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. అయినప్పటికీ పోలీసులు బుద్ధాను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుద్ధాపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ సందర్భంగా బుద్ధా వెంకన్న డీజీపీపై మండిపడ్డారు. డీజీపీ తీరు చూస్తుంటే జగన్ పార్టీకి డైరెక్టర్ లా ఉందని విమర్శించారు.
మంత్రి కొడాలి నానిపై మరోసారి నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానిపై ఈసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరేయ్ కొడాలి నాని… నీ భాష ఏంటి, నీ చరిత్ర ఏంటిరా? అంటూ ఘాటైన రీతిలో స్పందించారు. “గుడివాడలో ఆయిల్ దొంగవి నువ్వు… వర్ల రామయ్య నిన్ను లోపల వేసి చితకబాదాడు. పోలీసులు లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి… కొట్టుకుందాం! గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకువచ్చావు, నోటిదూలతో కృష్ణా జిల్లా పరువు తీశావు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
కాగా, తన ఇంటికి పోలీసులు రావడంపైనా బుద్ధా స్పందించారు. ఏపీ పోలీసుల తీరు అత్యంత విచారకరం అని పేర్కొన్నారు. “విచ్చలవిడిగా క్యాసినో నడిపిస్తే నో పోలీస్… ప్రతిపక్ష నేతని మంత్రి కొడాలి నాని బూతులు తిట్టినా నో పోలీస్. నేను మీడియా సమావేశం పెట్టిన అరగంటకే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని అర్థమవుతోంది” అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఖండన ….
టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు . ఇది దుర్మార్గమని మండిపడ్డారు . ఇది జగన్ మార్క్ ప్రజాస్వామ్యాన్ని ఈ దుర్మార్గపు చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు . వెంకన్న ను వెంటనే విడుదల చేయాలనీ చంద్రబాబు డిమాండ్ చేశారు .