ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్‌గా మారుస్తామన్నారుగా?: అక్బరుద్దీన్ ఓవైసీ
- బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఓవైసీ నిరసన
- పాతబస్తీ అభివృద్ధిని పట్టించుకోవట్లేదని ఆవేదన
- మైనారిటీలకు రుణాలే రావడం లేదని మండిపాటు
హైదరాబాద్‌లో అసౌకర్యాలకు అడ్డాగా మారిన పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మారుస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, అయితే ఆ దిశగా ఇప్పటిదాకా చర్యలు చేపట్టిన దాఖలా కనిపించలేదని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు బడ్జెట్‌పై స్పందించిన అక్బరుద్దీన్.. పాతబస్తీకి చెందిన పలు అంశాలను ప్రస్తావించారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా ఎప్పుడు మారుస్తారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన నిధుల కేటాయింపు, ఖర్చులకు అసలు పొంతనే లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క పేదవాడికైనా రుణం మంజూరైందా? అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన.. మరి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాతబస్తీలో నాలాల సమస్యలపై సమావేశానికి పిలుస్తామని కేటీఆర్ చెప్పారని, అయితే పండుగలన్నీ వెళ్లిపోతున్నా కేటీఆర్ నుంచి ఇప్పటిదాకా పిలుపే రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.