ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా.. బెంగాల్‌లో రెండు సీట్లూ టీఎంసీవే!
- అసన్‌సోల్‌లో శత్రుఘ్ను సిన్హా గెలుపు
- బల్లిగంజ్‌లోనూ టీఎంసీ అభ్యర్థిదే విజయం
- బీహార్‌లో ఆర్జేడీ అభ్యర్థిని గెలిపించిన ఓటర్లు
- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ విజయం
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్లకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. నానాటికీ దిగజారిపోతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏకంగా మూడు స్థానాల్లో విజయం దక్కింది. పత్తా లేకుండా పోయిందని భావిస్తున్న ఆర్జేడీ కూడా ఓ సీటును ఈ ఎన్నికల్లో దక్కించుకుంది. నాలుగు రాష్ట్రాల్లోని పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కింది విధంగా ఉన్నాయి.
అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ లోక్ సభ నియోజక వర్గం. ఇది అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి దక్కింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ సినీ నటుడు శ్రతుఘ్ను సిన్హా విజయం సాధించారు. ఇక అదే రాష్ట్రంలోని బల్లిగంజ్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో విజయం సాధించారు. ఈ ఇద్దరు నేతలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరిన వారే కావడం గమనార్హం.
ఇక బీహార్‌కు చెందిన బొచహాన్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు. అదే సమయంలో మహారాష్ట్రలోని కోల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొట్టేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కైరాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ విజయం సాధించకపోవడం గమనార్హం.