ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
-తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరిక
-అత్యవసర పరిస్థితుల్లో సమాచార, సంప్రదింపులకు అవరోధంగా ప్రకటన
-ప్రజలు హక్కులు పొందలేని పరిస్థితి ఉంటుందన్న యూఎన్
కారణాలు ఏవైనా.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే చర్యలను ఐక్యరాజ్యసమితి (యూఎన్) వ్యతిరేకించింది. ఇంటర్నెట్ షట్ డౌన్ లను అనుసరించొద్దంటూ ప్రపంచ దేశాలను కోరింది. ఇలాంటి చర్యల వల్ల భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇంటర్నెట్ సేవలను ఆపేయడం వల్ల అది ప్రజల హక్కులు, జీవనంపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల పడే ప్రభావాన్ని ప్రస్తావించింది.
‘‘అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు తమ డాక్టర్లను సంప్రదించలేవు. ఓటర్లు పోటీలో నిలిచి ఉన్న అభ్యర్థుల సమాచారాన్ని పొందలేరు. చేతి ఉత్పత్తులు తయారు చేసే వారు కస్టమర్లతో సంబంధాలు కోల్పోవాల్సి వస్తుంది. శాంతియుతంగా నిరసన తెలియజేసే వారు సాయం కోసం కాల్ చేసుకునే పరిస్థితి ఉండదు’’ అంటూ ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల ఎదుర్కోవాల్సి వచ్చే కొన్ని పరిస్థితులను ప్రస్తావించింది.
ఐక్యరాజ్య సమితి హక్కుల విభాగం చీఫ్ మిచెల్లే బాచెలెట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మానవ హక్కులను పొందడంలో డిజిటల్ ప్రపంచం కూడా తప్పనిసరి భాగంగా మారిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ సేవలను ఎక్కువ రోజుల పాటు నిలిపివేయడం నష్టదాయకంగా పేర్కొన్నారు. ఆర్థిక రంగానికి నష్టం కలిగించడమే కాకుండా.. వ్యక్తుల మానసిక తీరును ప్రభావితం చేస్తుందన్నారు.