టీడీపీ -జనసేన గుర్తింపు రద్దు చేయాలి :ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం -ఎమ్మెల్సీ డొక్కా..!
-కోనసీమ జిల్లా ను అంబేద్కర్ జిల్లాగా ప్రభుత్వం ప్రకటిస్తే టీడీపీ ,జనసేన స్పందించలేదు
-ఇది ఒక చారిత్రిక నిర్ణయమన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ …
-టీడీపీ , జనసేన నీచరాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్య
-అంబేద్కర్ ను కులమత రాజకీయాలకు అతీతంగా చూడాలని హితవు …
కోనసీమ జిల్లా పేరులో అంబేడ్కర్ పేరు చేర్చడం చాలా గొప్ప విషయమని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్కొన్నారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. అంబేద్కర్ ఒక కులం, మతానికి, ప్రాంతానికి పరిమితం కాదన్నారు. అలాంటి వ్యక్తి పేరు ఒక జిల్లాకు పెట్టినందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని అంతకు ముందు డిమాండ్ చేసిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్.. ఆ తర్వాత అమలాపురంలో జరిగిన హింసను, దాడులను ఇప్పటి వరకు ఖండించలేదని దుయ్య బట్టారు.
దీన్ని బట్టి వాటి వెనక ఎవరున్నారనేది అందరూ అర్ధం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వారు తరువాత ఎందుకు సమర్ధించలేదని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని..ఇటువంటి నీఛ రాజకీయాలను ప్రజలు క్షమించరని చెప్పుకొచ్చారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ స్పందించలేదన్నారు. అనైతికంగా వ్యవహరిస్తున్న వారు రాజకీయాల నుంచి వైదొలగాలన్నారు. ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని చెప్పుకొచ్చారు.
దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించాలని డిమాండ్ చేసారు. కోనసీమ జిల్లా ప్రజలు ఉన్నత విద్యావంతులు. వివేకవంతులు. కాబట్టి అక్కడ అల్లర్లు సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలువలేని రాజకీయాలు చేస్తున్న టీడీపీ, జనసేనను వంటి అనైతిక శక్తులను దూరంగా పెట్టాలని మాణిక్య వర ప్రసాద్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ను కులం, మతం, రాజకీయాలకు అతీతంగా చూడాలని హితవు పలికారు. అంబేడ్కర్‌తో ఏకంగా 1000 రకాలుగా స్ఫూర్తి పొందవచ్చని డొక్కా మాణిక్య వర ప్రసాద్ చెప్పుకొచ్చారు.