మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం!
- వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని వుడిపెల్లిలో ఘటన
- నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వైనం
- గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టి ఉంటారని అనుమానం
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని వుడిపెల్లిలో జరిగిందీ ఘటన. ఇంటి యజమాని మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), ఆమె అక్క కుమార్తె మౌనిక (25), మరో ఇద్దరు చిన్నారులతోపాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య (50) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
పద్మ అక్క కుమార్తె మౌనిక రెండు రోజుల క్రితమే కోటపల్లి మండలంలోని కొండంపేట నుంచి పద్మ ఇంటికి వచ్చారు. అగ్నిప్రమాదంలో ఆమె కూడా మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను చూసిన ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.