రైళ్లపై రాళ్లదాడులు.. ఐదేళ్ల శిక్ష తప్పదని రైల్వే హెచ్చరిక!
- వందేభారత్ రైళ్లపై ఇటీవల వరుస దాడులు
- ఏపీ, తెలంగాణలో 9 ఘటనలు
- 39 మంది అరెస్ట్
- దాడులకు పాల్పడి కష్టాలు కొని తెచ్చుకోవద్దన్న దక్షిణ మధ్య రైల్వే
వందేభారత్ రైళ్లపై ఇటీవల వరుసగా జరిగిన రాళ్లదాడులపై దక్షిణమధ్య రైల్వే తీవ్రంగా స్పందించింది. ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడే ఆకతాయిలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. కాబట్టి ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడొద్దని కోరింది.
రైల్వేలో ఇటీవల ప్రవేశపెట్టిన వందేభారత్ హైస్పీడ్ రైళ్లపై తెలంగాణలోని భువనగిరి, కాజీపేట, ఖమ్మంతోపాటు ఏపీలోని ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 9 వరకు జరిగాయి. ఇందుకు సంబంధించి 39 మందిని అరెస్ట్ చేశారు. రాళ్ల దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.