- ప్రభుత్వం ఆర్నెల్లు ఉంటుంది.. కానీ సోమేశ్ కుమార్‌ను మూడేళ్లు నియమించడమేమిటని ప్రశ్న
- ఆయన నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
- కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీ కోసం పని చేశారని ఆరోపణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ ను నియమించడంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ అధికారులు కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. అందుకే అలాంటి వారిని పక్కన పెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఇలాంటి సమయంలో సోమేశ్ కుమార్ ను మూడేళ్ల కాలానికి నియమించడమేమిటని ప్రశ్నించారు. సలహాదారులకు కేబినెట్ హోదా అవసరం లేదన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై దర్యాఫ్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పని చేశారని రేవంత్ ఆరోపించారు. హంగ్ వస్తే జేడీఎస్… బీజేపీకి మద్దతు తెలిపే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేశారన్నారు. మజ్లిస్ ఓట్లు చీలిస్తే జేడీఎస్ కు నష్టం జరుగుతుందని కేసీఆర్ భావించారని, అందుకే ఈ ఎన్నికలపై వ్యూహాత్మక మౌనం పాటించారని చెప్పారు. కర్ణాటక ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు.