కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ స్పందన
- చారిత్రక విజయం అందించిన కన్నడ ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన ప్రియాంక
- మీ కఠోర పరిశ్రమ ఫలితమని కార్యకర్తలకు ప్రశంస
- దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయమని వ్యాఖ్య
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఇంతటి చారిత్రక విజయం అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. భారత్ ను ఏకం చేసేందుకు లభించిన విజయం ఇది అన్నారు. మీ కఠోర శ్రమ గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నిర్విరామంగా పని చేస్తుందన్నారు. దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయం ఇది అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు…. కర్ణాటక అభివృద్ధికి ఈ విజయం నిదర్శనం అన్నారు ప్రియాంక. ఈ గెలుపు కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మీ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అని ట్వీట్ చేశారు.
ఇది బీజేపీ అంతానికి ఆరంభం: మమతా బెనర్జీ
- కర్ణాటక ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానన్న మమత
- బీజేపీ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటవని ప్రకటన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఘోర పరాజయంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి బీజేపీ అంతం మొదలైందని వ్యాఖ్యానించారు. ‘‘కర్ణాటక ప్రజలకు, ఓటర్లకు నేను సెల్యూట్ చేస్తున్నా. విజయం సాధించిన వారికీ నా సెల్యూట్. త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా బీజేపీ ఓడిపోతుందని అనుకుంటున్నా. బీజేపీ అంతానికి ప్రారంభం ఇదే’’ అంటూ మమతాబెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘అసలు వాళ్లకు (బీజేపీ) ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? యోగి రాజ్యం, అరాచకరాజ్యం ఉన్న యూపీలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. కానీ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడ ప్రతిపక్షం కూడా అంత బలంగా లేదు. కాబట్టి యూపీలో బీజేపీకి పరిస్థితి కొంత అనుకూలంగా ఉండొచ్చు. అయితే, అఖిలేశ్ యాదవ్ ఈసారి గట్టి పోటీనే ఇస్తారు. నేనూ ఆయన వెంట ఉంటాను. ఇక గుజరాత్ బీజేపీకి అనుకూలమే. హరియాణాలోనూ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. ఇవి మినహా వారికి సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలైన బీహార్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆ తరువాత ఢిల్లీ.. ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేక పవనాలే. అప్పట్లో బీజేపీ పీక్స్‌లో ఉంది. 275 అంతకు మించి సీట్లు సాధించుకుంది. కానీ ఈ మారు 100 సీట్లు కూడా దాటే పరిస్థితిలేదు’’ అంటూ బీజేపీ భవిష్యత్తును ఆవిష్కరించారు మమతా బెనర్జీ.