35 ఏళ్ల వయసున్న భార్యను హత్య చేయించిన వృద్ధుడు!
- ఢిల్లీలో వెలుగు చూసిన దారుణం
- మంచం పట్టిన కొడుకును చూసుకునేందుకు మహిళను పెళ్లాడిన వృద్ధుడు
- తాను ఆశించినది జరగకపోవడంతో భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం
- విడాకులు ఇవ్వాలంటే రూ. కోటి కావాలని భార్య డిమాండ్
- భార్యను ఎలాగైనా అడ్డుతొలగించుకునేందుకు హత్య చేయించిన నిందితుడు
ముప్ఫై అయిదేళ్ల వయసున్న మహిళను పెళ్లాడిన ఓ వృద్ధుడు(71) బుధవారం ఆమెను ఇద్దరు కిరాయి హంతకులతో హత్య చేయించాడు. దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. రాజోరీ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఎస్‌కే గుప్తా గతేడాది ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికి మంచం పట్టిన ఓ కుమారుడు(45) కూడా ఉన్నాడు. కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఆ వృద్ధుడు మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ, అతడు ఆశించినది జరగకపోవడంతో చివరకు మహిళకు డైవర్స్ ఇచ్చేందుకు నిర్ణయించాడు.
అయితే, విడాకులు ఇవ్వాలంటే రూ.కోటి కావాలని గుప్తాను అతడి భార్య డిమాండ్ చేసింది. దీంతో, భార్యను ఎలాగయినా వదిలించుకోవాలని గుప్తా నిర్ణయించాడు. ఈ క్రమంలో అతడు తన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లే విపిన్‌కు విషయం చెప్పాడు. చివరకు సదరు మహిళను హత్య చేయాలని వారు నిర్ణయించారు. హత్య కోసం రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించిన గుప్తా.. అడ్వాన్స్ కింద రూ.2.5 లక్షలను విపిన్‌కు ఇచ్చాడు.
ఈ క్రమంలో బుధవారం విపిన్ మరో వ్యక్తి హిమాన్షూతో కలిసి గుప్తా ఇంటికి వెళ్లి మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఇంట్లో ఉన్న ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. మహిళతో ఘర్షణ కారణంగా నిందితులకూ గాయాలయ్యాయి. హత్య సమయంలో గుప్తా కొడుకు అమిత్ ఇంట్లోనే ఉన్నాడు.
ఆ తరువాత పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితుల బండారం మొత్తం బయటపడింది. తాము తప్పు చేసినట్టు వారు అంగీకరించారు. ఈ క్రమంలో గుప్తా, ఆయన కుమారుడు అమిత్, కిరాయి హంతకులు విపిన్, హిమాన్షూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.