నిప్పుల కొలిమిలా ఢిల్లీ.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…
- హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
- ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు సూచన
- 24 నుంచి మూడు రోజులు చిరుజల్లులు పడే అవకాశం
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నాయి. నగరం నిప్పుల కొలిమిలా మారింది. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. నజఫ్ గఢ్ లో ఆదివారం మధ్యాహ్నం 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు మరో మూడు చోట్ల ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు. దీంతో అధికారులు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండపూట బయటకు రావొద్దని హెచ్చరించారు.
సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని, పలుచోట్ల ఆకాశం మేఘావృతమై గంటకు 25 నుంచి 35 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శనివారం ఢిల్లీలో పగటి పూట కనీస ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు నమోదు కాగా, గరిష్ఠంగా 40.4 డిగ్రీలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 24 (బుధవారం) నుంచి ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడుతుందని, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మేఘాలు ఆవరించి చిరుజల్లులు కురుస్తాయని వివరించారు.