యూకేలో భారత సంతతి వైద్య విద్యార్థిని దారుణ హత్య…!
- సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ప్రాంతంలో దారుణం
- ముగ్గురిపై కత్తితో దాడి చేసి అంతమొందించిన నిందితుడు
- దాడిలో మరో యువతి, 60 ఏళ్ల వృద్ధుడు మృతి
- వృద్ధుడి కారుతో మరో ముగ్గురిని ఢీకొట్టిన నిందితుడు
- బాధితులకు ఆసుపత్రిలో చికిత్స
- పోలీసులు అదుపులో నిందితుడు
యూకేలో తాజాగా ఓ భారత సంతతి వైద్య విద్యార్థిని గ్రేస్ ఓ మ్యాలీ కుమార్(19) దారుణ హత్యకు గురైంది. సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధిలో ఓ వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దాడిలో ఆమె స్నేహితురాలు బార్నబీ వెబ్బర్(19) కూడా మరణించింది. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. యువతులపై దాడి తరువాత నిందితుడు(31) ఓ 60 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి పొట్టనపెట్టుకున్నాడు. ఆయన కారుతో మరో ముగ్గురిని ఢీకొట్టాడు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు పోలీసులు అదుపులోనే ఉప్పటికీ వారు అతడి పేరును బహిరంగ పరచలేదు.
కాగా, యూకే హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పార్లమెంటులో వెల్లడించారు. ఇది ఉగ్రదాడి కాదని ఆమె పేర్కొన్నారు. యువతులు ఇద్దరూ నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. కత్తి పోట్లకు గురైన 60 ఏళ్ల వ్యక్తి స్థానిక స్కూల్‌లో సంరక్షకుడిగా ఉంటున్నాడని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగిందని వెల్లడించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు.