దూసుకొచ్చిన బైక్ లు.. జంప్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!
- ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం రోడ్డు పైకి వచ్చిన నితీశ్ కుమార్
- ఆయన వైపు దూసుకొచ్చిన రెండు బైక్ లు
- భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన బైకర్లు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో వైఫల్యం కలకలం రేపుతోంది. ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం తన నివాసం నుంచి నితీశ్ బయటకు వచ్చారు. ఇంటి నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లారు. సీఎం వాకింగ్ కు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరు వ్యక్తులు రెండు బైక్ లపై ఆ రోడ్డుపైకి వచ్చారు. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం వైపు దూసుకొచ్చారు.
దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే ఫుట్ పాత్ పైకి దూకారు. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంబడించి బైకర్లను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురి నివాసాలు ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత ఎస్ఎస్జీ కమాండెంట్, పాట్నా ఎస్ఎస్పీని పిలిపించుకుని నితీశ్ మాట్లాడారు.