ఎమ్మెల్యేతోపాటు భర్తపై కూడా సర్పంచ్ నవ్య ఫిర్యాదు.. దేనికైనా సిద్ధమన్న భర్త!
- తన భార్య ఏ శిక్ష వేసినా పర్వాలేదన్న భర్త ప్రవీణ్
- ఎమ్మెల్యే చెప్పడంతో తాను సంతకం కోసం కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని వెల్లడి
- తనతో నవ్య వాగ్వాదానికి దిగిందన్న భర్త
- ఎమ్మెల్యే రాజయ్య-సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిమెంట్ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్య, మరో నలుగురిపై ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో సర్పంచ్ నవ్య బుధవారం ఫిర్యాదు చేశారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసి, ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదే సమయంలో గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు తన నిధుల నుండి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో నిధులు ఇవ్వలేదని, పైగా తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోందని నవ్య… ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్… ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామని, రూ.20 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని రాజయ్య హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు రూ.7 లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలన్నారని, అలాగే రూ.20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పారన్నారు.
దీనికి సర్పంచ్ భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. ఎమ్మెల్యే… ప్రవీణ్ కు పలుమార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి అగ్రిమెంట్ పై సంతకం పెట్టమని ఒత్తిడి తెచ్చారు. సంతకం చేస్తే తాను తప్పు చేసినట్లవుతుందని నవ్య తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకుంటే పోలీస్ కమిషనర్ వద్దకు, మహిళా కమిషన్ వద్దకు వెళ్తానన్నారు నవ్య.

జానకీపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశంపై స్పందించారు. ఎమ్మెల్యే రాజయ్య, తన భర్త ప్రవీణ్ తో పాటు ముగ్గురిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నవ్య. గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలు అవాస్తవమంటూ స్టాంప్ పేపర్ పై సంతకం చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని, తన భర్తపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో ఆయన కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదంపై భర్త ప్రవీణ్ స్పందించారు.
తాను తప్పు చేశానని, తన భార్య ఎలాంటి శిక్ష విధించినా తాను సిద్ధమేనని చెప్పారు. తన భార్య ఆ రోజు రాజీపడేందుకు తానే కారణమని చెప్పారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, కానీ ఆ డబ్బును తామే తీసుకున్నట్లు గ్రామంలో ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడి భూమి విషయంలోను తనకు లక్షలు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోందన్నారు. తనకు ఎమ్మెల్యే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోందని, ఇదేమిటని తాను ఎమ్మెల్యేను అడిగానని చెప్పారు.
అయితే ఎమ్మెల్యే పొరపాటు లేదని, అలాగే రూ.20 లక్షలు అప్పుగా ఇస్తున్నట్లు తన భార్య నవ్యతో అగ్రిమెంట్ రాయించాలని ఎమ్మెల్యే తనతో చెబితే, తాను కూడా తన భార్యను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని చెప్పారు. దీనిపై తన భార్య తనతో వాగ్వాదానికి దిగిందన్నారు. రూ.20 లక్షలకు ఇలా చేస్తావా.. రేపు రూ.50 లక్షలు ఇస్తానంటే ఏం చేస్తావని తనను నిలదీశారని చెప్పారు. దీంతో తనతో పాటు ఎమ్మెల్యే, మరికొందరిపై నవ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. తన భార్య ఒక్కతే పోలీస్ స్టేషన్ కు వస్తుందని తాను వచ్చానని చెప్పారు.