Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కడియం శ్రీహరితో వివాదానికి తెరపడింది: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య

కడియం శ్రీహరితో వివాదానికి తెరపడింది: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య…

  • తాను కడియం కులం గురించి స్వయంగా ప్రస్తావించలేదని వెల్లడి
  • కేటీఆర్ పిలవడంతో ఉదయం వచ్చానన్న ఎమ్మెల్యే
  • నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుపీరియర్ అని కేసీఆర్ పలుమార్లు చెప్పారన్న రాజయ్య

నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వివాదానికి తెరపడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం తెలిపారు. తాను స్వయంగా కడియం కులం గురించి ప్రస్తావించలేదని, గతంలో ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఉటంకించినట్లు చెప్పారు. కడియంను దళిత వ్యతిరేకి అని గతంలో అన్నారని, అలా కాదని ఆయన నిరూపించుకోవాలని తాను సూచించానని, కేవలం ఇతరులు చెప్పిన మాటలను మాత్రమే ప్రస్తావించినట్లు చెప్పారు.

పార్టీ నేత, మంత్రి కేటీఆర్ తో రాజయ్య మధ్యాహ్నం భేటీ అయ్యారు. కడియంతో నియోజకవర్గంలో వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చారు. కేటీఆర్ తో భేటీ అనంతరం ఆయన టీవీ9తో మాట్లాడుతూ… తమ మధ్య వివాదం ముగిసిందని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి కూడా తనకంటే ముందు కేటీఆర్ ను కలిసినట్లుగా తనకు తెలిసిందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. అధిష్ఠానం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయన్నారు. 

కేటీఆర్ నుండి తనకు పిలుపు రావడంతో ఉదయం వచ్చానని, ఆయనతో మాట్లాడానన్నారు. తన నియోజకవర్గంలో తనపై అసత్య ప్రచారం జరుగుతుండటంతో తాను స్పందించాల్సి వచ్చిందని, ఇదే విషయాన్ని కేటీఆర్ దృష్టకి తీసుకువెళ్లానని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుపీరియర్ అని కేసీఆర్ వివిధ సందర్భాలలో చెప్పారన్నారు. కానీ కడియం గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద చెప్పానని, అయితే నియోజకవర్గంలో నీ పని నీవు చేసుకుంటూ వెళ్ళమని తనకు సూచించారన్నారు.

తాను నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నట్లు పార్టీ వద్ద సమాచారం ఉందన్నారు. తనకు టిక్కెట్ వస్తుందని నియోజకవర్గంలో కడియం ప్రచారం చేసుకుంటోన్న విషయాన్నీ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. అయితే ఎవరు తమకు టిక్కెట్ వస్తుందని చెప్పుకున్నప్పటికీ.. ఫైనల్ గా ఆ విషయాన్ని కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ తనకు చెప్పారన్నారు. ఎవరో మాట్లాడిన దానిని బట్టి మనం స్పందించవద్దని, క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ వెళ్లమని తనకు సూచించారన్నారు. సర్పంచ్ నవ్య తనపై చేసిన ఆరోపణలు మహిళా కమిషన్ వద్దకు వెళ్లాయని, కానీ అది తప్పుడు కేసు అని తేలిందన్నారు.

Related posts

డిప్యూటీ సీఎం భట్టి క్యాంపు కార్యాలయం ప్రజాభవన్….

Ram Narayana

 తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్!

Ram Narayana

బీజేపీ టార్గెట్ గా హైదరాబాద్ లో హోర్డింగ్స్

Drukpadam

Leave a Comment