యమునా నది మహోగ్రరూపం.. 48 ఏళ్ల రికార్డును మించి ప్రవాహం…
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక
- నివాస ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు
- ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వేలాదిమంది తరలింపు
- నీటి మట్టం మరింత పెరిగే అవకాశం
యమునా నదికి సమీపంలోని ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరడంతో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో వర్షం కురవకపోయినప్పటికీ హర్యానాలోని ఓ బ్యారేజీ నుండి, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా యమునా నదికి నీరు వచ్చి చేరుతోంది. యమనా నది నీటి ప్రవాహం ప్రమాదస్థాయిలో ఉండటంతో బ్యారేజీ నుండి నీటి విడుదలను పరిమితం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే నివాస ప్రాంతాలు ఖాళీ చేయాలన్నారు. యమునా నది ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయ చర్యలపై పర్యవేక్షించారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవాలని, యమునా నదికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. పాఠశాలలను పునరావాస శిబిరాలుగా మార్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.