ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదు: జీవీఎల్
- ఏపీలో రాజకీయ శూన్యత ఉందన్న జీవీఎల్
- బీజేపీ, జనసేన అధికారంలోకి రాబోతున్నాయని వ్యాఖ్యలు
- టీడీపీ పొత్తులో భాగం కాదని పరోక్షంగా వెల్లడించిన జీవీఎల్
- ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ఆదినారాయణరెడ్డి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీలో తమ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చిన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదని అన్నారు.
పురందేశ్వరి నియామకం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని, ఆమెను ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించడం ఎంతో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని జీవీఎల్ స్పష్టం చేశారు. త్వరలో బీజేపీ, జనసేన అధికారంలోకి రానున్నాయని వెల్లడించారు. 20 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
అయితే, బీజేపీకి చెందిన మరో నేత ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు జీవీఎల్ చెప్పినదానికి భిన్నంగా ఉండడం గమనార్హం. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదినారాయణరెడ్డి, జీవీఎల్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం గందరగోళం కలిగిస్తోంది.