- కరాచీకి చెందిన అమీనాకు భారతీయుడైన అర్బాజ్‌తో వివాహం
- పాకిస్థాన్‌లోని వరుడి తరపు బంధువుల ద్వారా కుదిరిన సంబంధం
- వీసా దొరకకపోవడంతో ఆన్‌లైన్ పెళ్లికి ఇరు కుటుంబాల నిర్ణయం
- వధువు కరాచీలో, వరుడు జోధ్‌పూర్‌లో ఉండగా వర్చువల్‌గా వివాహం
ఇటీవల భారత్, పాక్ జాతీయుల మధ్య ప్రేమ వివాహాలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. దీని వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయితే, ఓ భారతీయుడు, పాకిస్థానీ యువతి మధ్య పెద్దలు కుదిర్చిన వివాహం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇండియాకు వచ్చేందుకు యువతికి వీసా దొరక్కపోవడంతో ఆ జంట ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకోవడం మరో విశేషం. బుధవారం వీరి వివాహం జరిగింది.
పాకిస్థాన్‌లోని వరుడి తరుఫు బంధువులే ఈ సంబంధం కుదిర్చారు. వధువు అమీనా కరాచీలో ఉంటోంది. భారతీయ వరుడు అర్బాజ్ ఖాన్ ఇక్కడే చార్టెడ్ అకౌంటెంట్‌గా చేస్తున్నాడు. జోధ్‌పూర్ వేదికగా వీరి వివాహం వర్చువల్ విధానంలో అంగరంగ వైభవంగా జరిగింది. తమ తమ దేశాల్లో ఉంటూనే వధూవరులు వీడియో కాన్ఫరెన్సింగ్ సాయంతో సంప్రదాయ బద్ధంగా పెళ్లిచేసుకున్నారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. జోధ్‌పూర్‌కు చెందిన కాజీ ఈ పెళ్లిని జరిపించారు.
తొలుత అమీనా భారతీయ వీసా కోసం ప్రయత్నించి విఫలమైంది. దీంతో, వారు వర్చువల్‌గా వివాహం వైపు మొగ్గు చూపారు. ‘‘త్వరలో అమీనా మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటుంది. పాకిస్థాన్‌లో మేము పెళ్లి చేసుకుంటే ఇండియాలో గుర్తింపు దక్కదు. మేము మళ్లీ ఇండియాకు వచ్చి వివాహం చేసుకోవాల్సి వచ్చేది. ఇదంతా వద్దనుకుని ఇలా ప్రయత్నించాం’’ అని వరుడు అర్బాజ్ పేర్కొన్నాడు.