- టీటీడీ నూతన చైర్మన్‌గా తిరుపతి శాసనసభ్యుడు భూమన బాధ్యతలు
- తిరుమలలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి
- హిందూ ధార్మికతను, ఆధ్యాత్మికత విద్యుత్తును భక్తులకు అందించే కార్యక్రమాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్‌గా తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. తిరుమలలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సామాన్య భక్తులకు చేరేలా స్వామివారి కార్యక్రమాలు ఉంటాయన్నారు. తన మతంపై వస్తోన్న ఆరోపణల్ని పట్టించుకోనని చెప్పారు. తాను రెండోసారి పాలకమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానన్నారు.
సామాన్య భక్తుడే తమకు ప్రాధాన్యత అని, ధనవంతులకు ఊడిగం చేయడానికో, వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో తాను ఈ బాధ్యతలు తీసుకోలేదన్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ గతంలోలా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. హిందూ ధార్మికతను, ఆధ్యాత్మికత విద్యుత్తును భక్తులకు అందించే కార్యక్రమాలు చేపడతామన్నారు. భగవంతుడు మనల్ని చూస్తున్నాడా లేదా అన్నదే ముఖ్యమని తాను పెద్దలకు అప్పీల్ చేస్తున్నట్లు చెప్పారు.