- పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే.. కేసులు అంగుళం కూడా కదలవన్న జస్టిస్ దేవానంద్
- కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతాయని విమర్శ
- దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉండటంపై ఆందోళన
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నేరాల్లో ప్రముఖులు ఉంటే.. కేసులు అంగుళం కూడా ముందుకు కదలవని విమర్శించారు. కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. గుంటూరులో జరుగుతున్న ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ దేవానంద్ అన్నారు. సామాన్యుల కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతోందని అన్నారు. ‘‘ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు త్వరగా పరిష్కారమవుతాయి. పెద్ద నేరాల్లో ప్రముఖులు ఉంటే కేసులు అంగుళం కూడా కదలవు. కేసు విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలి. న్యాయవాదులు చొరవచూపినప్పుడే బాధితులకు న్యాయం చేకూరుతుంది. బార్ కౌన్సిల్, కోర్టు బెంచ్ సమన్వయంతో కేసులు త్వరగా పరిష్కరించాలి” అని జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు.