- దేశంలో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం… కొన్నిచోట్ల చినుకురాలని వైనం
- బీహార్ లోనూ వర్షాభావ పరిస్థితులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్టీఐ కార్యకర్త రాజ్ కుమార్ ఝా
- కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు
- దేవుడి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సమాచారం సేకరించాలని వింత దరఖాస్తు
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. బీహార్ లో ఇప్పటికీ వాన చినుకు లేక ప్రజలు అల్లాడుతున్నారు. దీనిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త కేంద్రానికి ఆశ్చర్యకరమైన రీతిలో దరఖాస్తు చేశాడు. వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కేంద్రాన్ని వివరణ కోరాడు.
బీహార్ లో వర్షాలు లేక దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిపై ఆందోళన చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్ కుమార్ ఝా కేంద్ర భూ విజ్ఞాన శాఖకు ఆర్టీఐ దరఖాస్తు పంపాడు. “బీహార్ లు ఎందుకు వర్షాలు పడడంలేదు? దేవుడ్ని అడిగైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోండి. అవసరమైతే ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 సేవలు ఉపయోగించుకోండి” అంటూ రాజ్ కుమార్ ఝా విస్తుగొలిపే రీతిలో దరఖాస్తు చేశాడు.
అంతేకాదు, కొన్ని విడ్డూరంగా అనిపించే వాదనలను కూడా రాజ్ కుమార్ ఝా ప్రస్తావించాడు. ఇస్రో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత ప్రకృతి కదలికలు ఆగిపోయాయా? అనే విషయంలోనూ తనకు జవాబు కావాలన్నాడు. చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగిన ప్రజ్ఞాన్ రోవర్ కు ఆధునిక సాంకేతిక పరికరాలు అమర్చారని, వాటి వల్ల ప్రకృతి స్తంభించిపోయి ఉంటుందని సందేహం వ్యక్తం చేశాడు.
దేవుడి సందేశాన్ని ప్రజ్ఞాన్ రోవర్ సేకరించాలని, ల్యాండర్ సాయంతో ఆ సమాచారాన్ని భూమికి చేరవేయాలని రాజ్ కుమార్ ఝా పేర్కొన్నాడు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించైనా సరే తన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని స్పష్టం చేశాడు.