Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబుకు జైల్లో ఏసీ పెట్టకుండా వేదిస్తున్నారన్న యనమల ….

పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారు: యనమల

  • జైలులో బంధించినా కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచిస్తున్నారని వెల్లడి
  • ప్రభుత్వం వారిపై చాలా తప్పుడు కేసులు పెట్టిందని ఆవేదన చెందుతున్నారు
  • ఏసీ పెట్టించకుండా చంద్రబాబును వేధిస్తున్నారని మండిపడ్డ యనమల

అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం జైలులో వేసినా పార్టీ కార్యకర్తలు, నాయకుల బాగోగుల కోసమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన యనమల.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విజనరీ నేత అని, తాను ఇబ్బంది పడుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పార్టీ కార్యకర్తల క్షేమం గురించి ఆరా తీశారని చెప్పారు. తనను చూడగానే పార్టీ కార్యకర్తలు, నాయకులపై ప్రభుత్వం చాలా తప్పుడు కేసులు పెట్టింది, కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగినట్లు పేర్కొన్నారు.

జాతీయ స్థాయి నేతను ప్రభుత్వం అమానుషంగా ట్రీట్ చేస్తోందని యనమల మండిపడ్డారు. అక్రమ కేసులతో జైలు పాలు చేసిన ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని విమర్శించారు. జైలుకు చేరుకున్న తొలి రోజుల్లో దోమల కారణంగా ఆయన ఇబ్బంది పడ్డా పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ప్రశ్నించిన తర్వాతే జైలు అధికారులు ఆయనకు దోమ తెరతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించారని యనమల వివరించారు. ఇప్పటికీ చంద్రబాబు ఉంటున్న సెల్ లో ఏసీ లేదని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను కోరినా సరిగా స్పందించలేదన్నారు.

భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి ఇప్పుడు జైలులో ఉండగా భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి నేడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని యనమల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏమైపోతుందోనని తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. తన అరెస్టుపై స్పందించిన రాష్ట్ర, జాతీయ నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేయాలని కోరారని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ ఆయన తరఫున మీడియా ముఖంగా ధన్యవాదాలు చెబుతున్నామని యనమల తెలిపారు. ప్రభుత్వం ఇకముందు కూడా కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించిన యనమల.. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రజల సంక్షేమం కోసం పార్టీ చేస్తున్న పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. జైలు గదిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచించే గొప్ప నేత చంద్రబాబు అని యనమల వివరించారు.

Related posts

పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా

Ram Narayana

సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు

Ram Narayana

“నేను” “నా” అనే అహంకారమే జగన్ ని దెబ్బతీసిందా …?

Ram Narayana

Leave a Comment