- రేపు విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సభ
- 8 వేల మంది హాజరవుతున్న ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రసంగం
- ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఈ సభ ద్వారా దిశానిర్దేశం
- సభా ఏర్పాట్లు పరిశీలించిన సజ్జల
ఏపీ అధికార పక్షం వైసీపీ రేపు విజయవాడలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తోంది. దాదాపు 8 వేల మంది పార్టీ ప్రతినిధులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులను, పార్టీలోని ఇతర నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ ప్రతినిధుల సభ నేపథ్యంలో, విజయవాడలో జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ నేతలు ఎన్నికల వరకు చాలా సమర్థంగా పనిచేయాల్సి ఉన్న నేపథ్యంలో, రేపు జరిగే సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం వైపు నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గత ఏడాదిగా తమ ప్రజాప్రతినిధులు గడప గడపకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్నారని సజ్జల వెల్లడించారు.
ఇక, చంద్రబాబు అంశంపైనా సజ్జల స్పందించారు. అవినీతి కేసులో అరెస్టయితే, టీడీపీ నేతలు ఆయనను ఒక విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ, దాని అనుబంధ శక్తులు సాగిస్తున్న దుష్ప్రచారం, తాము ఆ ప్రచారాన్ని ఎదుర్కొంటున్న తీరు రేపటి సీఎం జగన్ ప్రసంగంలో ప్రస్తావనకు వస్తాయని వెల్లడించారు….