- నవంబర్ 18న లండన్ సోథెబి వేలం శాలలో వేలం
- రూ.11 కోట్లు ధర పలకొచ్చని అంచనా
- నవంబర్ 1 నుంచి ముందస్తు బిడ్డింగ్
ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ ‘సోథెబి’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కాచ్ విస్కీని వేలానికి తీసుకురానుంది. లండన్ లో నవంబర్ 18న దీనికి వేలం నిర్వహించనున్నారు. దీనికి 1.4 మిలియన్ డాలర్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.11 కోట్లు. ఈ వివరాలను సోథెబి ప్రకటించింది.
అంత భారీ ధర పలకడానికి ఇందులో ఏముందబ్బా? అనిపించొచ్చు. ఇది ఇప్పటిది కాదు. 96 ఏళ్ల క్రితం నాటిది. సింగిల్ మాల్ట్ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ ఇది.‘‘ ప్రతి ఒక్క వేలందారు దీన్ని విక్రయించాలనుకుంటారు. ప్రతీ కొనుగోలుదారుడు దీన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటారు’’ అని సోథెబి స్పిరిట్స్ గ్లోబల్ హెడ్ జానీ ఫౌలే పేర్కొన్నారు. ఈ విస్కీకి నవంబర్ 1 నుంచే ముందస్తు బిడ్డింగ్ వేసుకోవచ్చు.
2019లోనూ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ బాటిల్ ఒక దాన్ని వేలం వేయగా, అప్పుడు 1.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) పలికింది. అరుదైన విస్కీ, ఎన్నో దశాబ్దాల క్రితం తయారు చేసినది కావడమే దీని భారీ ధరకు కారణాలు. విస్కీ ఎంత ఓల్డ్ అయితే, అంత రుచిగా ఉంటుందంటారు. 60 ఏళ్ల పాటు పీపాలలో మగ్గించి, 1986లో మెకాల్లన్ 1926 విస్కీని 40 బాటిళ్లు తయారు చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో ఒకే బాటిల్ వినియోగించినట్టు సమాచారం.