- శ్రీలంకపై గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి టీమిండియా
- మిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోతే 2 లేదా 3వ స్థానానికి దిగజారే ఛాన్స్
- కీలకమవనున్న ఆస్ట్రేలియా గెలుపు, రన్‌రేట్
రోహిత్ సారధ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ 2023లో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. మరింత మెరుగైన ఆటతీరును కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. గురువారం శ్రీలంకపై చరిత్రాత్మక గెలుపుని సొంతం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్‌లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత పేస్ దళం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా ధాటికి శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ వరసగా ఏడవ విజయాన్ని నమోదు చేసింది.
ఈ అద్భుత గెలుపుతో టీమిండియా వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ బెర్త్‌ని కూడా ఖరారు చేసుకుంది. 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో నిలిచింది. అయితే రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా ( 2.290) భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక టాప్-4లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
గ్రూప్ దశలో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. నెదర్లాండ్స్‌పై చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే అగ్రస్థానంలో నిలబడుతుంది. ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమీకరణంలో ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే భారత్ 3వ స్థానానికి దిగజారే ఛాన్స్ కూడా ఉంది. చెరో 14 పాయింట్లు ఉంటాయి కాబట్టి ఎవరిది ఏ స్థానం అనేది రన్‌రేట్ నిర్ణయించనుంది. ఒకవేళ టీమిండియా ఒక మ్యాచ్‌లో ఓడి, దక్షిణాఫ్రికాకు 2 విజయాలు సాధిస్తే ఇరు జట్లకు అప్పుడు 16 పాయింట్లు ఉంటాయి. రన్‌రేట్ ఆధారంగా ఒకటి, రెండు స్థానాలు ఖరారు కానున్నాయి.