Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అన్యాయం జరిగింది.. కానీ పార్టీ కోసం ఉపసంహరించుకున్నా: పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

  • పార్టీ నేతల బుజ్జగింపులతో నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేశ్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి కూడా తనకు టిక్కెట్ ఇవ్వలేకపోయారని ఆవేదన
  • నల్గొండ లోక్ సభ టిక్కెట్ పై హామీ వచ్చిందని వెల్లడి
  • పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్న పటేల్ రమేశ్ రెడ్డి

కాంగ్రెస్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపంతో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేశ్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియకు నేడే చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు రవి, రోహిత్ చౌదరి ఆయన నివాసానికి వెళ్లి ఉపసంహరింప చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలో పటేల్ రమేశ్ రెడ్డి అనుచరులు వారు ఉన్న గది వైపు రాళ్లు కూడా విసిరారు. మల్లు రవి, రోహిత్ చౌదరి బయటకు వెళ్లకుండా తాళం వేశారు. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలతో రమేశ్ రెడ్డి చేత మల్లు రవి, రోహిత్ చౌదరిలు మాట్లాడించారు. రమేశ్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన కాస్త చల్లబడ్డారు. 

నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ అనంతరం పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి పెట్టారు. విలపిస్తూనే మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనూ తనకు హామీలు ఇచ్చారని, కానీ అవి కూడా నెరవేరలేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా తనకు టిక్కెట్ ఇవ్వలేకపోయారని విలపించారు. తనకు నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఉందన్నారు. తాను ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. కానీ ఈ సమయంలో పార్టీకి తన అండ, తనకు పార్టీ అండ అవసరమని, అందుకే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. తనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పారన్నారు.

ఇప్పటికే నీకు అన్యాయం జరిగింది.. లోక్ సభ ఎన్నికల్లో తల అడ్డం పెట్టయినా అన్యాయం జరగకుండా చూస్తానని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారన్నారు. తనను దరదృష్టం వెంటాడుతోందన్నారు. అయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కార్యకర్తలు, అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. అంతకుముందు మల్లు రవి మాట్లాడుతూ… పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ టిక్కెట్ ఇస్తామన్నారు. కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట్లాడినట్లు చెప్పారు.

Related posts

పవన్ కల్యాణ ఎవరు… ఎక్కడి నుంచి వస్తున్నాడు?: మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు

Ram Narayana

బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కు రాజకీయాలు…నాపై ఐటీ దాడులుజరిపే అవకాశం ….

Ram Narayana

సతీసమేతంగా ప్రగతి భవన్ కు పొన్నాల… సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్

Ram Narayana

Leave a Comment