ఇది ప్రజాప్రభుత్వం, అందరం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దాం …మంత్రి పొంగులేటి
పాలేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి
ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం
ఆర్థిక పరిస్థితి పైనేకాదు ప్రతిశాఖ పై శ్వేతపత్రం విడుదల చేస్తాం …
అధికారులు సరైన లెక్కలు ఇవ్వాలి
ఆదర్శ నియోజకవర్గంగా పాలేరును తీర్చుదిద్దుదాం …
ఇది ప్రజాప్రభుత్వం …అందరం కలసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దాం …పాలేరును ఆదర్శ నియోజకార్గంగా తీర్చిదిద్దుదామని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణం ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు హితబోధ చేశారు …సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా నియోజకవర్గానికి చెందిన అధికారులతో మంత్రి సమక్షాసమావేశం నిర్వహించారు … ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు … ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయమని అన్నారు. ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు. సమీక్షలో పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఇర్రిగేషన్, రోడ్లు భవనాలు, డబల్ బెడ్ రూమ్, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు. మిషన్ భగీరథ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎంత మంది ప్రజలు, ఎన్ని గృహాలకు త్రాగునీటి సరఫరా చేస్తున్నది నివేదిక సమర్పించాలన్నారు. విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తున్నది తెలుపాలన్నారు. జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలకు స్థల కేటాయింపు, ఫ్యాకల్టీ, పూర్తి స్థాయిలో కళాశాల నడిచేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్ కు సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నట్లు, 143 గ్రామ పంచాయతీలు ఉండగా, 95 గ్రామ పంచాయతీలకు స్వంత భవనాలు ఉండగా, 43 భవనాలు ఇజిఎస్ క్రింద మంజూరయి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఇజిఎస్ క్రింద ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు క్రింద 2 ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరం లేని చోట భూసేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికివచ్చే భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్నేరు వాగు నుండి లిఫ్ట్ లేకుండా, గ్రావిటీ తో సీతారామ ప్రాజెక్టుకు నీరు వెళుతుందా, ప్రణాళిక చేయాలన్నారు. పాలేరు లింక్ కెనాల్ కు సంబంధించి, భూసేకరణకు, రైతులతో మాట్లాడతానని, పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో 5 కాలనీల్లో 97 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు, 2 కాలనీల్లో సంక్రాంతి లోగా పూర్తయే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికి కేటాయించిన డబల్ బెడ్ రూం ఇండ్లు, గ్రామ సభ ద్వారా, లాటరీ ద్వారా, ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు. తహశీల్దార్లు ఇప్పటికి జారీచేసిన పొజిషన్ సర్టిఫికెట్లు, పాస్ బుక్ లు పునః పరిశీలించి తప్పులు జరిగితే సరిదిద్దాలన్నారు. అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు ఇట్టి విషయాల్లో పర్యవేక్షణ చేయాలన్నారు. వైద్యానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంతమంది సిబ్బంది ఉన్నది, ఎంత మంది ఖాళీలు ఉన్నవి నివేదిక ఇవ్వాలన్నారు. వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు అవుతున్నది, పనిచేయు స్థలంలో ఉంటున్నది నివేదిక ఇవ్వాలన్నారు. 7/24 వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా, ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కల్గెలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డయాలసిస్ రోగులు నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నది తెలపాలని, వైద్య విషయంలో పాలేరు ను ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గ పరిధిలో నగరానికి చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించాలని, నిబంధనల మేరకు పనులు జరగాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వమని, ఇబ్బందులు, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, పాలసీలపై ఇన్ పుట్ ఇవ్వాలని, సమిష్టి గా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని, వేతనాలు 1-5వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రారంభమయి 50 శాతానికి పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని, మంజూరయిన పనులు పునః సమీక్షించి, ప్రాధాన్యత ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తామని, ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, రెవిన్యూ, భూ, అనేక సెక్టార్లలో సంస్కరణలు తెస్తామని, అందరం కలిసి ప్రజలకు మంచి చేసినదే నిజమైన పరిపాలన అని మంత్రి తెలిపారు.
ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి ప్రసాద రావు, జిల్లా అధికారులు, డివిజన్, పాలేరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మొదటిసారి వచ్చిన మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ , సీపీ విష్ణు ఎస్ వరీయర్ ఇతర అధికారులు స్వాగతం పలికారు ...
పూలతో ప్రేమగా…!
- శాలువాలు…బొకేలతో శీనన్నకు శుభాకాంక్షలు
- ఉమ్మడి జిల్లా నుంచి తరలొచ్చిన ప్రజానీకం
- జనసందోహంతో కిక్కిరిసిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఖమ్మం నగరంలోని ఆయన గుమ్మంలో తొలిసారిగా అడుగుపెట్టిన మంత్రి పొంగులేటికి ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు విచ్చేసిన శీనన్నకు శాలువాలు, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. పూల మొక్కలను ప్రేమతో అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఉ న్నతస్థాయి వర్గానికి చెందిన వారు మొదలు సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ శీనన్నను కలిశారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేసిన చిరు సత్కారాలను స్వీకరించారు. ఉమ్మడి జిల్లా ప్రజల ఆదరాభిమానాలే తనకు ఉన్నత పదవి వరించేలా చేసిందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. ఉదయం 06.30గంటల నుంచి మొదలైన తాకిడి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొనసాగింది. శీనన్నను కలిసేందుకు వచ్చిన వాహనాలు క్యాంపు కార్యాలయం బయట బారులు తీరాయి.