Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

సైకో పాలన పోవాలనే టీడీపీ, జనసేన పొత్తు … యువగళం ముగింపు సభలో చంద్రబాబు…

ఇవాళ పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు: చంద్రబాబు

  • పోలిపల్లిలో టీడీపీ యువగళం సభ
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • తాను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారని వెల్లడి
  • పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ అధినేత
Chandrababu says Pawan Kalyan talked with open heart

యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, టీడీపీ వీర సైనికులకు, జనసేన జనసైనికులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు.

గతంలో తాను ఎన్నోసార్లు విశాఖకు వచ్చానని, కానీ ఇవాళ తనకు లభించిన అపూర్వస్వాగతాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఓవైపు సముద్రం ఘోషిస్తుంటే, మరోవైపు జనసముద్రం ఘోషపెడుతోందని అభివర్ణించారు. ఇవాళ విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు తరలివచ్చారని, ఎన్నికల యుద్ధభేరి మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరుపేరునా నమస్కారాలు అని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు… ముఖ్యంగా యువగళం వాలంటీర్లకు నా అభినందనలు అంటూ వివరించారు. 

నేను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారు

ఇవాళ సభలో అందరూ మాట్లాడారు. నేను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు. తన మనసులో ఉన్నది చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించిందీ, ఇప్పుడు మరోసారి ఏం ఆకాంక్షించి టీడీపీ, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయో స్పష్టంగా చెప్పారు” అని వివరించారు. 

ఇక నారా లోకేశ్ కూడా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన అనుభవాలను కూడా క్లుప్తంగా చెప్పారు. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్రలు చేయడం కొత్త కాదు. నేను కూడా పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారు. అక్కడ్నించి ఎన్నో యాత్రలు వచ్చాయి. 

45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో… ఓ పాదయాత్రపై దండయాత్ర చేయడం ఈ సైకో పాలనలోనే చూశాను. ఓ మంచి ఆశయంతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాతనైతే సహకరించాలి, చాతకాకపోతే ఇంట్లో పడుకోవాలి కానీ… యువగళం పాదయాత్రను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లపై కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీటన్నింటికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను నేను తీసుకుంటాను తమ్ముళ్లూ!

ఒక్క చాన్స్ ఇస్తే ధ్వంసం చేశాడు

ఒక్క చాన్స్ అని ఇస్తే జగన్ విధ్వంస పాలనకు నాంది పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. లిక్కర్, ఇసుక, మైన్లు, ఇలా అన్ని అంశాల్లో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అమరావతిని సర్వనాశనం చేసి, మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖలో రుషికొండను బోడిగుండుగా మార్చారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. వైసీపీ నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి ఏర్పడింది. 

ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి?

అబద్ధాల పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ. ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పారా, లేదా మీరు? రైల్వే జోన్ సాధిస్తామన్నారు… దాని సంగతి ఏమైంది? మద్యపాన నిషేధం అమలు చేశాకే నేను ఓటు అడుగుతానని చెప్పి, మద్యపానంపై వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి దానిపై అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సీపీఎస్ ను రద్దు చేశారా… అదీ లేదు! బాబాయ్ ని చంపి ఆ హత్యను వేరొకరిపై వేశారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వీటికితోడు బాదుడే బాదుడు. అన్ని ధరలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులపాలయ్యారు.

Related posts

జనవరి నుంచి జనంలోకి జగన్.. క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్లాన్

Ram Narayana

ఏపీలో శాంతిభద్రతలపై మాజీ సీఎం జగన్ నాయకత్వంలో దేశరాజధాని ఢిల్లీలో ధర్నా …

Ram Narayana

చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా షర్మిల వ్యవహరిస్తున్నారు: వరుదు కల్యాణి…

Ram Narayana

Leave a Comment