- మణిపూర్ ప్రజల ప్రాణాల కంటే బీజేపీకి ఓట్లే ముఖ్యమని ఆరోపణ
- రాహుల్ అక్కడకు వెళ్లి ప్రజల మధ్య వైషమ్యాలు తొలగించే ప్రయత్నాలు చేశారని వ్యాఖ్య
- తెలంగాణలో పేదల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ అన్న రేవంత్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నాంపల్లి గ్రౌండ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో మత సామరస్యం పరిఢవిల్లాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కొన్ని పార్టీలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మణిపూర్ మంటల్లో కాలిపోతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మణిపూర్ ప్రజల ప్రాణాల కంటే బీజేపీకి ఓట్లే ముఖ్యమని మండిపడ్డారు.
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లి ప్రజల మధ్య వైషమ్యాలు తొలగించే ప్రయత్నాలు చేశారన్నారు. మణిపూర్ వంటి సంఘటనలు దేశంలో మరెక్కడా జరగకూడదన్నారు. తెలంగాణలో పేదల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని.. ప్రజల కోసం పని చేస్తున్నామన్నారు.