- ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు
- చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ ల కలియికతో వేడెక్కిన పాలిటిక్స్
- షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్
- వైఎస్ కూతురుగా షర్మిలకు మంచి ఫాలోయింగ్ ఉందని భావిస్తున్న అధిష్ఠానం
- వైసీపీ ఓట్లు కాంగ్రెస్ కు చీలుతాయనే భావనలో కాంగ్రెస్ పెద్దలు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పీకే పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇదే జోరులో ఏపీలో కూడా కొంత పుంజుకునే విధంగా వ్యూహాలను రచిస్తోంది. అవసరమైతే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని టీఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదనే ఆలోచనతో ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
కాంగ్రెస్ కు షర్మిల చేసిన ఉపకారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తుంచుకుంది. ఈ క్రమంలో ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురుగా షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేస్తే… పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. వైసీపీలో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులే ఉన్న నేపథ్యంలో, షర్మిలకు బాధ్యతలను అ్పగిస్తే ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, క్రిస్మస్ సందర్భంగా నారా లోకేశ్ కు షర్మిల గిఫ్ట్ పంపిన విషయం కూడా ఏపీ రాజకీయాల్లో మరో చర్చకు దారి తీసింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఏపీలో రాబోయే రోజుల్లో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.