- ఏపీలో ఊపందుకున్న ఎన్నికల కోలాహలం
- అభ్యర్థుల ఎంపికలో వైసీపీ బిజీ
- ప్రజల్లోకి వెళ్లడంలో టీడీపీ దూకుడు
- జనవరి 25 నుంచి పార్టీ శ్రేణులతో సీఎం జగన్ సమావేశాలు
ఏపీలో ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే వేడి రాజుకుంది. ప్రస్తుతం ప్రధాన పార్టీల దృష్టి అంతా గెలుపు గుర్రాల వంటి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, ప్రజలను తమవైపు తిప్పుకోవడంపైనే ఉంది. ఈ విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమదైన పంథాలో ముందుకు వెళుతున్నాయి.
కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వైసీపీ క్యాడర్ తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై వైసీపీ నాయకత్వం నుంచి పార్టీ శ్రేణులకు సమాచారం అందింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో మీటింగ్ లు నిర్వహించి, క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారని వైసీపీ వెల్లడించింది. 4 నుంచి 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహిస్తారని తెలిపింది.
పార్టీ సభ్యులందరినీ ఏకం చేసి, వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం అని వైసీపీ వివరించింది.
ఈ ప్రాంతాల వారీ క్యాడర్ సమావేశాల్లో మొదటి సమావేశం జనవరి 25న విశాఖట్నంలోని భీమిలిలో జరగనుందని వెల్లడించింది. మిగిలిన నాలుగు ప్రాంతాల్లో జరిగే సమావేశాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వైసీపీ పేర్కొంది.