డిప్యూటీ సీఎం భట్టి నిర్ణయంపై ప్రశంసలు …అభివృద్ధిలో అన్ని పార్టీల భాగస్వామ్యం…!
మధిర అఖిలపక్ష నాయకుల తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం…
మధిర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…
మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు వేసి అభివృద్ధి చేస్తా …
విద్యా వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి…
సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు…
డిప్యూటీ సీఎం భట్టి తన సొంత నియోజకవర్గం మధిర అభివృద్ధిపై మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవడంపట్ల ప్రశంసలు వెల్లు ఎత్తుతున్నాయి ….అన్ని పక్షాలను కలుపుకొని పోవాలని అనుకోవడం మంచి పరిణామమని అంటున్నారు పరిశీలకులు ….ఆ సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు తర్వాత మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేద్దాం నాకు మీ ద్వారా వచ్చిన పదవిని అందరికి సంక్షేమం ,అభివృద్ధి కోసం వినియోగిస్తా …ఎప్పుడైనా మీ సలహాలు ఇవ్వవచ్చినని అనడంపై నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ….
మధిర నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భట్టి కోరారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి అఖిలపక్ష నాయకులతో మధిర లోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టిఆర్ఎస్, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, సిపిఐ ఎం నాయకులు హాజరైనారు. నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి వారితో గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి పార్టీల వారీగా ప్రతిపక్ష నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మధిర పట్టణ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు వేసి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు. . మధిర నుంచి అంబార్పేట మీదుగా హైదరాబాదుకు వాహనాల రాకపోకలు పెరిగిన క్రమంలో చెరువు కట్టను విస్తరించి కట్ట పైన రోడ్డు వెడల్పు చేయడానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మధిర పట్టణంలో గత కొంత కాలం నుంచి వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వారు వ్యాపారం చేసుకోవడానికి రోడ్డును కేటాయించి అక్కడ వారి వ్యాపారం సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మధిర పట్టణంలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని జాలుముడి, కట్టలేరు, పండ్రేగుపల్లి సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, లెఫ్ట్, రైట్ కెనాల్స్ పనులను పూర్తి చేయించి మరింత ఆయ కట్టును సాగులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాను కృషి చేస్తానని, అభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని ఎన్నికల తర్వాత తనకు అభివృద్ధి ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మధిర నియోజకవర్గ అభివృద్ధికి కీలక సూచనలు చేశారు.
మధిరను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని, మధిరలో పలు రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకోవాలని, డిపోలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు స్టాఫ్ నియామకం చేయించాలని, పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్, ధర్నా చౌక్, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి, లెదర్ పార్క్ ప్రారంభానికి తగిన చర్యలు, వైరా నుంచి ఎర్రుపాలెం వరకు డబుల్ రోడ్డు వేయించాలని, మధిర పట్టణాన్ని సుందరీకరణ చేయాలని, పంప్ హౌస్ వద్ద ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ సెంటర్ నుంచి తాళ్లూరు ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు వేయించడం తో పాటు శివాలయం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయించాలని, తహశీల్దార్ కార్యాలయం పక్కన మెయిన్ రోడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయించాలని భట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేశారు.
జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరగా టెంపుల్ అభివృద్ధికి కావలసిన యాక్షన్ ప్లాన్ తాను రెడీ చేయిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులకు వివరించారు. అఖిలపక్ష నాయకులు ఇచ్చిన సలహాలు సూచనలతో పాటు నియోజకవర్గంలో ఇందిరమ్మ డైరీ ఏర్పాటు చేసి ఉపాధికి బాటలు వేయనున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యా లత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రామనాథం, మల్లాది హనుమంతరావు, మార్నేటి పుల్లారావు, బిజెపి నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, పాపట్ల రమేష్, సిపిఐ నాయకులు బెజవాడ రవి, సిపిఐ ఎం నాయకులు శీలం నరసింహారావు, మంద సైదులు తదితరులు పాల్గొన్నారు.