Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేయాల్సిందే …డిప్యూటీ సీఎం భట్టి

అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మధిరలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మధిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో వివిధ శాఖలచే పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు వేగం చేయాలన్నారు. మధిర మునిసిపల్ పరిధిలో టెండర్ ప్రక్రియ పూర్తయి, పురోగతిలో ఉన్న పనుల పూర్తిపై దృష్టి పెట్టాలన్నారు. వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని, ట్రాఫిక్ లేకుండా వుండే రహదారిపై వారికి వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ట్యాoక్ బండ్ పై రోడ్డు వెడల్పుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంబారిపేట చెరువులో గణేష్ నిమజ్జనానికి బదులు ప్రత్యామ్నాయ చెరువును గుర్తించాలన్నారు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
మధిర చుట్టూ ఉన్న రోడ్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రోడ్లు, భవనాల శాఖచే చేపట్టాల్సిన నూతన పనులు, బిటి రోడ్ల అభివృద్ధి పై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలల భవనాలను, నియోజకవర్గంలో మంజూరు అయి, ఇతర ప్రదేశాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలకు కేటాయించాలన్నారు. నియోజకవర్గంలో 3 ఎస్సి, 4 బిసి, ఒక మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, స్వంత భవనాలు లేని వాటికి స్థల కేటాయింపు అయినచోట భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాన్నారు. కట్టలేరు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జాలిముడి పనులు అసంపూర్తిగానే అప్పగించారని, మిగులు పనులు పూర్తి చేయించాలని అన్నారు. జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. జాలిముడి కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ చేయాలన్నారు. స్నానాల లక్ష్మీపురం దేవాలయాన్ని అభివృద్ధి పర్చలన్నారు. నదికి ఇరువైపులా స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. మధిర పెద్ద చెరువు, జమలాపురం, ఇంద్రాయ చెరువు బండ్లను అభివృద్ధి చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 131 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు, ఇంకనూ స్వంత భవనాలు లేని పంచాయతీలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలు చేపట్టి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నవాటి జాబితా ఇవ్వాలన్నారు. కనెక్టివిటీ లేని అనుబంధ గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 245 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 89 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టగా, 50 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, 14 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తయి, పునః ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, అధికారులు అన్ని పారామీటర్స్ తనిఖీలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనుల పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన అన్నారు.

అనంతరం రూ. 34 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో ఉపముఖ్యమంత్రి పరిశీలించారు. ఆసుపత్రి ప్లానును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రూ 2.65 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియంను సందర్శించి పరిశీలించారు. మిగులు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, క్రికెట్ పిచ్, లాంగ్ జంప్ కోర్ట్, అవుట్ డోర్ ఖోఖో కోర్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ కళాశాల, డిగ్రీ కళాశాల ను పరిశీలించారు. కళాశాల స్థలానికి ప్రహారి గోడ నిర్మాణం చేపట్టాలన్నారు. కళాశాల విద్యార్థులు మినీ స్టేడియంలో క్రీడా ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఆరోగ్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

మీ స్టాండ్‌ను బట్టి మా స్టాండ్ ఉంటుంది: మంద కృష్ణ మాదిగ

Ram Narayana

25 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment