- 2017 నుంచి ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులు నీట్ ద్వారా భర్తీ
- ఎంసెట్ ద్వారా కేవలం ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలోనే ప్రవేశాలు
- ఎంసెట్‌లోని ‘ఎం’ అక్షరాన్ని తొలగించాలని ప్రతిపాదనలు
- కొత్త పేరు టీఎస్ఈఏపీ లేదా టీఎస్ఈఏ సెట్‌గా మార్చే అవకాశం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న ఎంసెట్ ప్రవేశపరీక్ష పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చాలని భావిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో ఎంసెట్‌లో మార్పులు చేశారు. అప్పటి వరకు ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశాలకు ఎంసెట్ ఒకే పరీక్షను నిర్వహించింది. 2017 నుంచి ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయితే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకే ఎంసెట్ నిర్వహిస్తోంది. అయినప్పటికీ అప్పటి నుంచి ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో మెడికల్ పేరును తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఎంసెట్‌లో ఉన్న ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించి టీఎస్ఈఏపీ లేదా టీఎస్ఈఏ సెట్‌గా మార్చాలని ప్రతిపాదనలు చేశారని తెలుస్తోంది. ఇక్కడ ‘పీ’ అంటే ఫార్మసీ. ఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున ఈ అక్షరాన్ని జత చేశారు. పై రెండింటిలో ఒక పేరును ప్రభుత్వం ఫైనలైజ్ చేయనుంది.