Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

భారత్ ఎమర్జెన్సీ విమాన సర్వీసుకు మాల్దీవులలో అనుమతి నిరాకరణ.. 14 ఏళ్ల బాలుడు మృతి

  • మెడికల్ ఎమర్జెన్సీ తరలింపునకు భారత విమానానికి అనుమతి లేకపోవడంతో విషాదం
  • ఎయిర్ అంబులెన్స్ సర్వీసు ఆలస్యమవ్వడంతో మాల్దీవులలో 14 ఏళ్ల బాలుడు మృతి
  • దౌత్య బంధాలు దెబ్బతినడంతో భారత విమానాలను ఉపయోగించొద్దని ఇటీవలే ఆదేశించిన మాల్దీవుల అధ్యక్షుడు

భారత్ – మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో విషాదకర ఘటన నమోదయింది. మాల్దీవులకు భారత్‌ అందించిన ‘డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌’ అనే చిన్న విమానం ఎమర్జెన్సీ ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతూ స్ట్రోక్‌ కు గురైన బాలుడిని మాల్దీవులలోని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని తమ ఇంటి నుంచి ఎయిర్ అంబులెన్స్‌ ద్వారా రాజధాని మాలే నగరానికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ మేరకు అభ్యర్థన కూడా చేశారు. కానీ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ఈ మధ్య భారత్ అందించిన విమానాలను ఉపయోగించొద్దని ఆదేశించడంతో బాలుడిని అత్యవసరంగా తరలించడం సాధ్యపడలేదని మాల్దీవుల మీడియా పేర్కొంది.

హాస్పిటల్ వైద్యులు బాలుడిని తరలించేందుకు సత్వరమే ఏర్పాట్లు చేసినప్పటికీ విమానాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాలాసార్లు ఫోన్ చేసినప్పటికీ అధికారుల నుంచి సమాధానం రాలేదని, వారి నుంచి సమాధానం వచ్చేలోగా నష్టం జరిగిపోయిందని వాపోయారు. అభ్యర్థన చేసిన 16 గంటల తర్వాత మాలేకి బాలుడిని తరలించామని, అప్పటికే బాగా ఆలస్యమవ్వడంతో బాలుడి ప్రాణాలు దక్కలేదని వివరించారు. కాగా ఇలాంటి ఎమర్జెన్సీ కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఉండటమే పరిష్కారమని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు మాల్దీవుల మీడియా పేర్కొంది.

అత్యవసర తరలింపునకు సంబంధించిన అభ్యర్థన అందిన వెంటనే తరలింపునకు ఏర్పాట్లు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ చివరి క్షణంలో విమానానికి సంబంధించిన సాంకేతిక అంశం విషయంలో తక్షణ తరలింపు సాధ్యం కాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షదీప్ పర్యటనను ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

Related posts

జపాన్ లో బియ్యం కొరత.. సూపర్ మార్కెట్లలో నో స్టాక్ బోర్డులు…

Ram Narayana

అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలగడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్…

Ram Narayana

డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక!

Ram Narayana

Leave a Comment