Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

వెయ్యి కోట్ల విలువైన ఆ బంగారం సముద్రం పాలైందా?

  • రెండో ప్రపంచ యుద్ధంలో మారణకాండ సాగించిన నాజీలు
  • ఇష్టం వచ్చినట్టు దోచుకున్న హిట్లర్ సేనలు
  • రష్యాలోని ఆంబర్ రూమ్ ను కూడా దోచుకున్న వైనం
  • నాడు ఆంబర్ రూమ్ లో 6 టన్నుల బంగారం 

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నాజీ సేనలు చేయని దురాగతం అంటూ లేదు. నరమేధం సాగించడంతో పాటు ఇష్టంవచ్చినట్టు దోచుకున్నారు. ఆ రోజుల్లో నాజీ సైన్యం దోచుకున్న వేల కోట్ల విలువైన బంగారం సముద్రంపాలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

నాజీలు దోచుకున్న బంగారాన్ని భారీ మొత్తంలో ఎంవీ విల్ హెల్మ్ గస్ట్ లాఫ్ నౌకలో తరలిస్తుండగా, ఆ నౌక మునిగిపోయినట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇది 80 ఏళ్ల నాటి మాట. ఆ పసిడి నిక్షేపాలు సముద్ర గర్భంలో ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

ఇంతకీ నాజీలు ఈ బంగారు నిధులను దోచుకుంది రష్యా నుంచి. రష్యాలో ఆంబర్ రూమ్ గురించి తెలియనివాళ్లు ఉండరు. దీన్ని ప్రపంచపు ఎనిమిదో వింత అని చెప్పుకునేవారు. ఈ ఆంబర్ రూమ్ లో ఆరు టన్నుల బంగారం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం దాని విలువ రూ.2,546 కోట్లు ఉంటుంది. 

రెండో ప్రపంచ యుద్ధం వేళ రష్యాలో ప్రవేశించిన నాజీ సేనలు ఆంబర్ రూమ్ ను బద్దలు కొట్టాయి. ఆ బంగారాన్నంతటిని కోనిగ్స్ బెర్గ్ కోటకు తరలించారు. అయితే యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బంగారాన్ని అక్కడ్నించి కూడా తరలించాలని హిట్లర్ ఆదేశించాడు. దాంతో అది హిట్లర్ ఖజానాకు చేరింది. అయితే, నాజీ అధికారుల్లోని కొందరు అందులో సగం బంగారాన్ని విల్ హెల్మ్ నౌక ద్వారా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ నౌక తన గమ్యస్థానాన్ని చేరకుండానే సముద్రగర్భంలోకి జారుకుంది. 

ఆ నౌకను 1945 జనవరి 30న సోవియట్లు ముంచేశారని చరిత్ర పుటల్లో నమోదైంది. సోవియట్ యూనియన్ కు చెందిన జలాంతర్గాములు ఈ నౌకపై టార్పెడోలు ప్రయోగించాయి. మునిగిపోయిన సమయంలో ఆ నౌకలో 10,600 మంది ఉండగా, అందులో 9,400 మంది జలసమాధి అయ్యారని అంచనా. టైటానిక్ ప్రమాదంలో మృతి చెందినవారి కంటే విల్ హెల్మ్ నౌకలో మరణించినవారి సంఖ్య ఆరు రెట్లు అధికం. 

మాజీ సీ డైవర్ ఫిల్ సేయర్స్ ఈ నౌక మునక నుంచి ప్రాణాలతో బయటపడిన రుడి లాంగ్ అనే వ్యక్తిని కలుసుకోగా, అతడు ఈ బంగారం రహస్యాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. అప్పటికి రూడీ వయసు 17 ఏళ్లు కాగా, నౌకలో అతడు రేడియో ఆపరేటర్ గా ఉన్నాడు. నాజీలు బంగారంతో కూడిన పెట్టెలను నౌకలోకి లోడ్ చేస్తుండగా తాను చూశానని తెలిపాడు. అప్పటి పోలాండ్ లోని ఓ రేవు పట్టణం నుంచి బయల్దేరిన విల్ హెల్మ్ నౌక మార్గమధ్యంలోనే దాడికి గురైంది. 

సీ డైవర్ గా పేరొందిన ఫిల్ సేయర్స్ నౌక మునిగిపోయిన ప్రాంతంలో 1988లో పరిశోధించాడు. నౌక అవశేషాలను గుర్తించినా, బంగారం జాడలు కనిపించలేదు. బహుశా, బంగారంతో కూడిన పెట్టెలు సముద్రంలో ఇసుక పొరల కింద బాగా లోతులో ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

Related posts

హత్య కేసులో.. బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు జీవితకాల జైలు శిక్ష…

Ram Narayana

గాల్లో విన్యాసాలు చేస్తూ ఢీకొన్న రెండు విమానాలు.. పైలట్ మృతి..

Ram Narayana

లెబనాన్ లో పేజర్ పేలుళ్ల వెనక మొసాద్!

Ram Narayana

Leave a Comment