- ఓ మైనింగ్ సంస్థ నుంచి సీఎం కూతురి ఐటీ సంస్థకు నిధులు చేరాయంటూ ఆరోపణలు
- గతేడాది ఈ ఉదంతాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ
- ఘటనపై ఎస్ఎఫ్‌ఐఓ దర్యాప్తు కొనసాగుతున్న వేళ రంగంలోకి ఈడీ
- మనీలాండరింగ్ కోణంలో సీఎం కూతురి ఐటీ సంస్థపై కేసు నమోదు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. వీణకు చెందిన ఐటీ సంస్థతో పాటు కొచ్చిన్‌లోని గనుల సంస్థ సీఎమ్ఆర్ఎల్‌పై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఈసీఐఆర్‌ను (ఎఫ్ఐఆర్ లాంటిది) దాఖలు చేసింది. మరోవైపు ఈ ఉదంతంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్‌ఐఓ) కూడా దర్యాప్తు చేస్తోంది.
గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్‌నదన్.. వీణ ఐటీ సంస్థ ఎక్సాలాజిక్‌పై చేసిన ఫిర్యాదులతో ఎస్ఎఫ్ఐఓ రంగంలోకి దిగింది. సీఎమ్‌ఆర్ఎల్ మైనింగ్ సంస్థ నుంచి ఎక్సాలాజిక్‌కు 1.72 కోట్ల నిధులు అందాయని మ్యాథ్యూ ఆరోపించారు. ఇక సీఎమ్ఆర్ఎల్ సంస్థలో కేరళ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు (కేఎస్‌ఐడీసీ) 13 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో సీఎమ్ఆర్ఎల్ సంస్థతో పాటూ కేఎస్‌ఐడీసీ అధికారులను కూడా ఎస్ఎఫ్ఐఓ ప్రశ్నించింది. వారి వివరణలను రికార్డు చేసుకుంది.
అయితే, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తును నిలుపుదల చేయాలంటూ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేఎస్‌ఐడీసీకి చుక్కెదురైంది. దర్యాప్తు నిలుపుదల కోరుతూ మరో పిటిషన్ వేసిన ఎక్సాలాజిక్‌కు కూడా న్యాయస్థానంలో ఊరట దక్కలేదు.