- జీవశాస్త్ర ప్రశ్న పత్రంలోని రెండు ప్రశ్నల్లో అస్పష్టత
- అయోమయానికి గురైన విద్యార్థులు సరైన సమాధానాలు రాయలేకపోయిన వైనం
- ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉండటంతో 8 మార్కులు పోవచ్చని ఆందోళన
- పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరిస్తామన్న ఖమ్మం విద్యాశాఖ డీఈఓ
ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో జీవశాస్త్ర ప్రశ్న పత్రంలో తప్పులు దొర్లడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు ప్రశ్నలు అయోమయంగా ఉండటంతో సరైన సమాధానాలు రాయలేకపోయిన అనేక మంది తాము మార్కులు కోల్పోతామని ఆందోళనతో ఉన్నారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
తప్పులు ఇవీ..
ప్రశ్న పత్రంలోని సెక్షన్-2లో ఇచ్చిన 5వ ప్రశ్నలో ‘మీ దైనందిన జీవితంలో పరిశీలించిన ఏవేని రెండు కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహరణలతో రాయండి’ అని ఆంగ్లంలో అడిగారు. ‘ఏవేని రెండు కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి’ అని తెలుగులో అడిగారు. ఈ ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు సరైన సమాధానాలు రాయలేకపోయారు.
ఇదే సెక్షన్‌లోని 6వ ప్రశ్నను బ్లూప్రింట్ విధానాన్ని అనుసరించి, 4వ విద్యా ప్రమాణానికి అనుకూలంగా అడగాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రశ్నను రూపొందించడంతో విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారు. ఈ సమస్యను సబ్జెక్టు నిపుణుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ఉన్నతాధికారులకు వివరిస్తామని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు.