Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మూర్ఖుడు, దుర్మార్గుడు అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

నాలుగు నెలలు ఓపిక పట్టాం… ఇక కేసీఆర్ ఆగడు, మీ వెంట పడతా: కేసీఆర్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేరోజు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని చెప్పానని… ఓ గడువు పెట్టి ఆ లోగా ఇవ్వకుంటే తాను భిక్షాటన చేసి ఇస్తానని హెచ్చరించానని.. అయినప్పటికీ ఆ దుర్మార్గుడు ఇవ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఇవ్వకపోవడంతో నిజామాబాద్ పట్టణం, హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భిక్షాటన చేశానని.. రూ.7 లక్షలు వస్తే ఆ చేనేత కార్మికులకు ఇచ్చినట్లు తెలిపారు. అలా గద్వాల, దుబ్బాక, భువనగిరి, సిరిసిల్లలో రోజూ చనిపోయే చేనేత కార్మికులకు ఎంతోకొంత సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా కొన్ని పథకాలు పెట్టామన్నారు. అందులో భాగంగానే వారికి ప్రభుత్వం నుండి ఆర్డర్లు ఇచ్చామన్నారు.

ఆత్మహత్యలు వద్దని గోడల మీద రాతలు

ఉద్యమం సమయంలో సిరిసిల్లకు వెళుతుండగా గ్రామాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడల మీద రాతలు కనిపించేవని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారని, చావొద్దని గోడల మీద రాసిన పరిస్థితులు చూసి తమ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయన్నారు. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో చావకండంటూ గోడల మీద రాతలు రాసే ప్రభుత్వాలను చూడటం కంటే దౌర్భాగ్యం ఏముందని తాము బాధపడ్డామన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. 

సిరిసిల్లలో ఒకేరోజు పదకొండు మంది చేనేత కార్మికులు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి… ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఇప్పటికీ సిరిసిల్లలో ఉందన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని… తెలంగాణ వస్తది… వచ్చాక బిడ్డల్లా చూసుకుంటామని చేనేత కార్మికులకు హామీ ఇచ్చామన్నారు. ఆత్మహత్యలు వద్దని చేనేత కార్మికులకు చెప్పామన్నారు. అనుకున్నట్లుగా దేవుడి దయవల్ల తెలంగాణ వచ్చిందని… మన ప్రభుత్వం వచ్చిందన్నారు.

  • హామీలు నెరవేర్చే వరకు తాము కాంగ్రెస్ వెంట పడతామని హెచ్చరిక

రైతుబంధు ఇవ్వకుంటే పులుల్లాగా మీ గొంతు కరుస్తాం… నాలుగు నెలలు ఓపిక పట్టాం…. కానీ ఇక కేసీఆర్ ఆగడు… గద్దల్లా మీ వెంటపడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం పర్యటించిన కేసీఆర్, సాయంత్రం సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హామీలు నెరవేర్చే వరకు తాము కాంగ్రెస్ వెంట పడతామని హెచ్చరించారు. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, వంద శాతం దానికి న్యాయం చేస్తామన్నారు. చేనేత కార్మికుల పట్ల కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని అవసరమైతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు.

కరీంనగర్‌లో తాము జలధారలు సృష్టిస్తే కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఈ జలధారలు ఎడారులుగా మారిపోయాయని ఆరోపించారు. దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అన్నారు. ఈ రోజు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోయర్ మానేరు డ్యామ్‌ ఎంతో అద్భుతంగా ఉండేదని… ఎండాకాలం తర్వాత కూడా సగం డ్యామ్ నీరు ఉండేదన్నారు. కరీంనగర్ నగరంలో కూడా నీళ్ళు వచ్చేవని… కానీ ఇప్పుడు రోజుమార్చి రోజు ఇస్తున్నారన్నారు. మున్ముందు మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారేమో అని విమర్శించారు. 2014కు ముందు కాలిన మోటార్లు, బిందెల కొట్లాటలు కనిపించేవని… ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా వేయలేదన్నారు.

100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని తాను చెబితే… జాబితా ఇవ్వాలని అధికార పార్టీ అడిగిందని, తాము నాలుగు గంటల్లోనే ఆ జాబితాను ఇచ్చామని గుర్తు చేశారు. వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచలేదు… పైగా ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను రెఫరెండం అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను టెంప్ట్ చేసిందన్నారు. ఇందిరమ్మ పాలనలో ఇగిలిచ్చిన పరిస్థితైందన్నారు. నీటి నిర్వహణ సామర్థ్యం లేక.. వాటిని ఎలా వాడాలనే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొంతమంది అసమర్థులైన మంత్రులు వర్షపాతం తక్కువ ఉంటే మా మీద బద్నాం పెడుతున్నారని అంటున్నారని… కానీ పలు జిల్లాల్లో అధిక వర్షపాతం ఉందన్నారు. అధిక వర్షపాతం ఉండగా పంట ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. 

చేనేత కార్మికులు దొబ్బితిన్నారు… నిరోద్‌లు అమ్ముకొని బతకాలని అవమానిస్తారా… అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడుతూ… తెలంగాణలో అసలు బీజేపీ లేనే లేదన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేక మా పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు.

Related posts

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామ

Ram Narayana

ఆ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఇంకా వీడని సస్పెన్స్!

Ram Narayana

బీఆర్ఎస్‌కు భారీ షాక్… ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు…

Ram Narayana

Leave a Comment