- చైనాలో ఐక్యరాజ్యసమితికి నేతృత్వం వహిస్తున్న భారత అధికారి సిద్ధార్థ ఛటర్జీ
- యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల ప్రాముఖ్యం తెలియజేసేందుకు యోగా ప్రదర్శన
- బీజింగ్‌లో గడ్డకట్టిన సరస్సుపై సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో యోగా
- చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉదంతం
చైనాలో ఐక్యరాజ్యసమితికి నేతృత్వం వహిస్తున్న భారత అధికారి సిద్ధార్థ ఛటర్జీ సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో (సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే దిగువ ఉష్ణోగ్రతలు) గడ్డకట్టిన సరస్సుపై యోగా, శ్వాస ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా, శ్వాస ఎక్సర్‌సైజులు ఎంత మేలు చేస్తాయో అవగాహన కల్పించేందుకు ఆయన తన ఎక్సర్‌సైజులకు సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోను విడుదల చేశారు. చటర్జీ ప్రస్తుతం చైనాలో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు.
బీజింగ్‌లోని ఓ గడ్డకట్టిన సరస్సుపై ఆయన అర్ధనగ్నంగా యోగా చేశారు. శీర్షాసనం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేశారు. ‘‘భూమ్మీద పడ్డాక శిశువు చేసే తొలి పని శ్వాసించడమే’’ అంటూ ఆయన ప్రాణాయామానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు.
2020లో ఆయన చైనాలో ఐక్యరాజ్య సమితి బాధ్యతలు చేపట్టారు. చైనా-భారత్ దౌత్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇక యూఎన్ బాధ్యతలు చేపట్టేనాటికి 60 ఏళ్లకు చేరుకున్న ఆయన ఊబకాయం, హైకొలెస్ట్రాల్, బీపీ, ప్రీ డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, ఇతర కసరత్తులతో ఏకంగా 25 కిలోలు తగ్గి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన చటర్జీ స్వాంతంత్ర్య పోరాట సమయంలో కుటుంబం సహా కోల్‌కతాకు వచ్చేశారు. ఆ తరువాత పోలియో బారిన పడి అదృష్టవశాత్తూ కోలుకున్నారు. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడ్డ అతికొద్ది మంది అదృష్టవంతుల్లో తానూ ఒకడినని ఆయన తెలిపారు. చిన్నప్పుడు తన కాళ్లను క్రియాశీలకం చేసేందుకు వైద్యులు ఇచ్చిన విద్యుత్ షాకులు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పుకొచ్చారు.
1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన అనంతరం తన జీవితం మలుపు తిరిగిందని ఛటర్జీ తెలిపారు. పారా రెజిమెంట్‌లో పనిచేసిన ఆయన ఆ తరువాత అమెరికాలోని ప్రముఖ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఐక్యరాజ్యసమితి పీస్‌కీపింగ్ మిషన్స్‌లో భాగంగా ఆయన పలు దేశాల్లో పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన కెన్యా, స్విట్జర్ల్యాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, సౌత్ సుడాన్, సుడాన్, ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా, ఇరాకీ కుర్దిస్థాన్, చైనా వంటి పలు దేశాల్లో సేవలందించారు.
మరో విశేషమేంటంటే..ఛటర్జీ భార్య దక్షిణ కొరియా మహిళ. ఆమె ప్రస్తుతం భారత్‌లో యూనీసెఫ్ సోషల్ పాలసీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.