Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఐదు చోట్ల అభ్యర్థులను మార్చిన టీడీపీ.. కొత్తవారికి బీ ఫారాలు అందజేత

  • ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు
  • గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్
  • మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి
  • మడకశిర, వెంకటగిరి అభ్యర్థులను కూడా మార్చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తెలుగుదేశం పార్టీ స్వల్ప మార్పులు చేసింది. ఐదు చోట్ల అభ్యర్థులను మార్చుతూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి నియోజకవర్గాలకు ముందు ప్రకటించిన అభ్యర్థులను తప్పించి కొత్తవారికి టికెట్ ఇచ్చారు. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కగా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరిని ఎన్నికల బరిలో దించారు. అదేవిధంగా, మాడుగుల టికెట్ ను బండారు సత్యనారాయణమూర్తికి, మడకశిర టికెట్ ను ఎంఎస్‌ రాజుకు, వెంకటగిరి నియోజకవర్గ టికెట్ ను కురుగొండ్ల రామకృష్ణకు కేటాయించారు. వీరికి ఆదివారం మిగతా అభ్యర్థులతో కలిపి అమరావతిలో చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు.

ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న ఎంపీ తోట సీతారామలక్ష్మీని పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సీటును ఆశించారు. అయితే, పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో బండారుకు మాడుగుల సీటును కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్‌ నాయుడుకు కేటాయించగా.. ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నిలబెట్టారు. మడకశిర, వెంకటగిరి నియోజకవర్గాల్లో సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు కేటాయించగా.. ప్రస్తుతం వారిని మార్చి ఎంఎస్‌ రాజు, రామకృష్ణలకు అవకాశం కల్పిస్తూ చంద్రబాబు టికెట్లు కేటాయించారు.

Related posts

చంద్రబాబు అరెస్టు కు నిరసనగా రాజమండ్రిలో భువనేశ్వరి బ్రాహ్మణి కొవ్వెత్తుల ప్రదర్శన …

Ram Narayana

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్ కు పంపారు: నారా లోకేశ్

Ram Narayana

ఓపిక నశించింది … మళ్ళీ పాత పెద్దరెడ్డిని చూస్తారు …

Ram Narayana

Leave a Comment