- ఉత్తరాంధ్రలో వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో సభ
- పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించిన సీఎం జగన్
- కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా జవాబు చెప్పాలని పిలుపు
సీఎం జగన్ ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అని సమర శంఖం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు.
రేపటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి… చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముంగిపేనని అన్నారు. ఈ ఐదేళ్లలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి… కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా ఓటుతో జవాబు చెప్పండి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
“ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే చంద్రబాబు సంస్కృతిని గతంలో చూశాం. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏవైతే హామీలు ఇచ్చామో అందులో 99 శాతం నెరవేర్చామని సగర్వంగా చెబుతున్నాను.
చంద్రబాబు పరిస్థితి చూస్తే అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని దిగజారిపోయారు. నాలుగు మంచి పనులు చేశానని చెప్పుకోలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడు. వాళ్ల చానళ్లు, వాళ్ల పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపిస్తారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా?
అధికారం కోసం ఇప్పుడు కూటమి కట్టి వస్తున్నారు. ఇలాంటి వారికి అధికారం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? అందమైన వాగ్దానాలు చేసి, ఐదేళ్ల పాటు వంచించడానికి, ప్రజలను లూటీ చేసిదోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట!” అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.