- సీబీఐ చార్జిషీట్ లో పేరున్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో కడప ప్రజలకు జగన్ చెప్పాలి
- సాక్ష్యాలు తుడిపేస్తుంటే అవినాశ్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడ్డాడట.. అలాంటి వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నారంటూ ప్రశ్న
- ఈ ఎన్నికల్లో వైఎస్ బిడ్డ ఓడిపోతే ఆ గెలుపు నేరానిదేనని వ్యాఖ్య
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ ఆరోపిస్తున్న వ్యక్తి.. సీబీఐ చార్జిషీట్ లో పేరున్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కడప ప్రజలకు జగన్ వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయి హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్ సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల చెప్పారు. కడప ప్రజలకు నిజం తెలియాలని, నిజం గెలవాలనే తాను పోరాడుతున్నానని వివరించారు. ఈ ఎన్నికలు ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచిందని అర్థమని షర్మిల స్పష్టం చేశారు.
రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జిషీట్ లో చేర్చిందెవరు..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ సీబీఐ చార్జిషీట్ లో చేర్చిందన్న జగన్ ఆరోపణలపై వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ రెడ్డి సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్ వేశాడని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు సీబీఐ చార్జిషీట్ లో లేకుంటే జగన్ కేసుల నుంచి బయటపడడం కష్టమని సుధాకర్ రెడ్డి పదేపదే కోర్టులలో పిటిషన్లు వేశాడని ఆరోపించారు. దీంతో సీబీఐ వైఎస్ఆర్ పేరును చార్జిషీట్ లో చేర్చిందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. కన్నతండ్రి పేరును సీబీఐ చార్జిషీట్ లో ఇరికించిన వ్యక్తిని జగన్ అక్కున చేర్చుకున్నారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు రోజులకే సుధాకర్ రెడ్డిని పిలిచి ఏఐజీ పదవి కట్టబెట్టారని గుర్తుచేశారు.